
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో కర్షక, కార్మిక సదస్సు నిర్వహించారు. మేధా పాట్కర్ మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులను అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర రావడంలేదని, అదానీ, అంబానీలకు మాత్రం రూ.వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు.
ఆదివాసీల హక్కులను దెబ్బతీస్తూ అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తున్నారన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హన్నన్ ముల్లా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 13 నెలలపాటు రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టులో ఆందోళనలను నిర్వహిస్తామన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.