పిల్లలకోసం కెరీర్ త్యాగం...
మహిళల తొలి ప్రాధాన్యం
పిల్లల సంరక్షణే; తర్వాతే ఉద్యోగం
చిన్నారుల ఎదుగుదలలోనే జీవితాన్ని
ఆస్వాదిస్తున్న మహిళలు
అసోచామ్ సర్వేలో వెల్లడి...
మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. ప్రతి స్త్రీ తల్లి కావాలని పరి తపిస్తుంది. పిల్లల ఎదుగుదలకు, సంరక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తుంది. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకుంటుంది. అమ్మతనంలోని కమ్మని క్షణాలను తొలిసారి ఆస్వాదించిన మహిళ లు పిల్లల భవిష్యత్తు కోసం వారి కెరీర్‌ను సైతం వదులుకుంటున్నారు. పిల్లల కోసం ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి సంరక్షణ, పెంపకాన్నే ఒక ఉద్యోగంలా స్వీకరిస్తున్నారు. ఈ విషయం అసోచామ్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అసోచామ్‌కు సంబంధించిన సోషల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, ఢిల్లీ వంటి 10 ప్రధాన నగరాలలో నివసిస్తున్న 25-30 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 400 మంది మహిళలపై సర్వే నిర్వహించింది. మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో అసోచామ్ ఈ సర్వే నిర్వహించింది.
ఉద్యోగాలు త్యాగం...
పట్టణ ప్రాంతాలలోని బాగా చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న మహిళలు ఎక్కువగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఉద్యోగాలకు స్వస్తిపలుకుతున్నారనే అంశం సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న మొత్తం మహిళలలో (తొలిసారి మాతృత్వపు మాధుర్యం ఎరిగిన వారు) దాదాపు 1/4 వంతు మంది పిల్లల పెంపకం కోసం వారి ఉద్యోగాలను వదిలేశారు. అలాగే కొందరు మహిళలు వారి పిల్లలకు స్కూల్‌కు వెళ్లే వయసు వచ్చిన తర్వాత తిరిగి కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో వారు గతంలో చేసిన ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేయడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి కారణం సహోద్యోగులు వారిపట్ల వివక్ష చూపిస్తారనే భయం.
సున్నిత అంశం...
పిల్లల ఎదుగుదలలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి కొందరు మహిళలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడానికి సుముఖత చూపుతున్నారు. తమ పిల్లలు ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి త్యాగానికైనా మాతృమూర్తులు సిద్ధమంటున్నారు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడి, భావోద్వేగాలు, సామాజిక బాధ్యతలు వంటి అంశాల వల్ల ప్రస్తుతం మహిళలకు పిల్లల పెంపకం ఒక సున్నితమైన అంశంగా పరిణమించిందని అసోచామ్ జనరల్ సెక్రటరీ రావత్ అభిప్రాయపడ్డారు.