ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు(ఎస్‌వీఎన్ కాలనీ) : తాగితే తప్పేముంది అనుకుంటున్నారేమో పట్టణ వాతావరణంలోని 18ఏళ్లలోపు యువత పెగ్గులు లాగించేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నీరుగారుస్తున్నారు. స్నేహితులతో కలిసి మొదట సరదాగా మద్యం రుచి చూస్తున్న యువత రానురాను డోస్ పెంచేసి దానికి బానిసలుగా మారుతున్నారు. బంగారు భవిష్యత్తును చేతులారా చిదిమేసుకుంటున్నారు. అసోచామ్, పీటర్‌బర్గ్ విశ్వవిద్యాలయం వంటి సామాజిక అధ్యయన సంస్థలు తేటతెల్లం చేస్తున్న దిగ్భ్రాంతికర విషయాలు పరిశీలిస్తే ఉజ్వల భవితవ్యం ఉన్న యువభారతం పెడదోవ పడుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల వ్యవహారశైలిపై ఓ కన్నేసి ఉండాల్సిందేనని మనస్తత్త్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
నేరాలకు మూలమిదే..
సిగరెట్లు వద్దంటూనే, మందే ముద్దు అని యువత రెచ్చిపోతోంది. పెరుగుతున్న అశాంతి, నేరాలు, ఘోరాలకు ప్రధాన కారణం తాగిన మైకమేనని మనస్తత్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు చాటి చెబుతున్నా పట్టించుకుంటున్నవారే కరువవుతున్నారు. అమ్మాయిలు కూడా బాటిల్ మూతలు తెరుస్తున్నారు. దీనికి ఒత్తిడి, పాకెట్‌మనీలో విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్ఛ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. అసోచామ్ సోషల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఏఎస్‌డీఎఫ్) అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైంది. ప్యారిస్‌కు చెందిన అర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) నివేదికను పరిశీలిస్తే భారత్‌లో 10 ఏళ్ల కాలంలో ఆల్కహాల్ వినియోగం 55 శాతం పెరిగిందని స్పష్టం చేస్తోంది. మరీ ముఖ్యంగా యువత, మహిళల్లో కూడా ఆల్కహాల్‌వినియోగం పెరిగిందని ఆ సంస్థ చెబుతూనే చిన్నారులు ఈ అలవాటు బారిన పడటం ఆందోళనకరమంటూ హెచ్చరించింది.
ఈ అంశాల ఆధారంగా ఆసోచామ్, పీటర్‌బర్గ్ యూనివర్సిటీ సంయుక్తంగా టీనేజ్ డ్రింకింగ్‌పై దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనంలో 16 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతపై ఆన్‌లైన్ క్లినికల్ ట్రైల్ చేపట్టింది. ఇందులో మూడో వంతు టీనేజర్లు తాము కాలేజీలో ప్రవేశించక మునుపే ఆల్కహాల్ టేస్ట్ చేస్తున్నారని తేల్చారు. 40 శాతం టీనేజర్లు తమకు 15–17 సంవత్సరాల వయసున్నప్పుడే మందు తాగామని చెప్పారు. 20–29 ఏళ్లు కలిగిన 69 శాతం మంది యువతీ, యువకులు తాము నూతన సంవత్సర, వీకెండ్ వేడుకల్లో మద్యం తాగామని ఒప్పుకుంటున్నారు. అయితే అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా తాగుతున్నారని గుర్తించారు. అధిక శాతం మంది యువతులు తమ పాకెట్ మనీలో గరిష్ట శాతం మూవీ టికెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కేఫ్ సెంటర్స్‌లోనే ఖర్చు చేస్తున్నామన్నారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణే కీలకం
తల్లిదండ్రులు ఆల్కహాల్‌ను పిల్లల ముందు సేవించడం, పిల్లలతో ఆనుబంధం సరిగాలేకపోవడం, విద్యా సమస్యలు, ఆల్కహాల్ తీసుకున్నా ఏమీకాదనే భావన, వ్యాపార ప్రకటనలు, చట్టాలు సరిగా అమలు చేయకపోవడం, బార్లలో ఆఫర్లు వంటివి యువత మద్యానికి ఆకర్షితులవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
విచ్చలవిడి పాకెట్‌మనీ
ఎక్కువశాతం యువత వీకెండ్ వేడుకలు వచ్చాయంటే రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఆల్కహాల్ మీదనే ఖర్చు చేస్తున్నారని, అధికశాతం ఆల్కహాల్ వినియోగిస్తున్న చిన్నారులు, టీనేజర్లు సంఘంలో ఉన్నత కుటుంబాలకు చెందిన వారేనని గుర్తించారు. యువతులు ఫ్రూటీఫ్లేవర్డ్ ఆల్కహాల్ ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.
ఇదీ ముప్పు
ఆల్కహాల్ అధికంగా వినియోగించడం వల్ల స్వీయ ప్రమాదాలు కొనితెచ్చుకోవడం, హైరిస్క్, విచిత్ర మనస్తత్వ ధోరణి, సెక్సువల్ ప్రవర్తన, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ వ్యాధులు, అల్సర్‌లు, అసహనానికి లోనుకావడం(ఆల్కహాల్ డిపెడెన్సీ సిండ్రో మ్), హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డీ ఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లాలి
మద్యం మత్తులోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 25 ఏళ్లలోపే ఎక్కువ మంది మద్యానికి బానిసలవుతున్నారు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మద్యం అలవాటును నివారించేందుకు డీ ఎడిక్షన్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వారికి తగిన విధంగా కౌన్సెలింగ్, చికిత్స అందించగలిగితే చాలా వరకు మార్పు వస్తుంది. – డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, హెచ్‌వోడీ మానసిక వైద్య విభాగం
ఆరోగ్య సమస్యలకు మూలం
తెలిసీతెలియని ప్రాయంలో ఒత్తిడిని అధిగమించాలనే ఉద్దేశంతో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మద్యం అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని గమనించాలి. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఎక్కువగా మద్యం వ్యసనపరులే ఉంటున్నారు. మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు 20 ఏళ్లప్రాయంలోనే తలుపు తట్టడానికీ మద్యమే కారణం. – డాక్టర్ వైవీఎస్ ప్రభాకర్, ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment