వ్యాపారం మీది.. వేదిక మాది!
⇒ వ్యక్తిగత వర్తకులు, ఎస్‌ఎంఈలకు ఆన్‌లైన్ వ్యాపార వేదిక
⇒ క్రాఫ్ట్‌లీలో చేనేత, హస్తకళలకు ప్రత్యేక విభాగం కూడా..
⇒ కేంద్ర ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్‌తో ఎంవోయూ
⇒ అందుబాటులో 1,500 విభాగాల్లో 70 లక్షల ఉత్పత్తులు
⇒ ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
⇒ ‘స్టార్టప్ డైరీ’తో క్రాఫ్ట్‌లీ కో–ఫౌండర్ విశేష్ ఖురానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
బ్రాండెడ్ ఉత్పత్తులు లేదా స్థానికంగా పేరొందిన ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో కొనాలంటే ఈజీనే. ఎందుకంటే వీటికి బోలెడన్ని వేదికలున్నాయి. మరి, చిన్న, మధ్య తరహా సంస్థలు, వ్యాపారస్తుల ఉత్పత్తుల పరిస్థితేంటి? మరీ ముఖ్యంగా చేనేత, హస్తకళా ఉత్పత్తులకో? ఆయా తయారీ సంస్థలు, విక్రయదారులకు సరైన ఆన్‌లైన్ వేదికంటూ లేకపోవటంతో పోటీపడలేకపోతున్నాయి. దీనికి పరిష్కారం చూపిస్తోంది క్రాఫ్ట్‌లీ.కామ్. ఈ సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి దాని వ్యవస్థాపకుడు విశేష్ ఖురానా ఏం చెబుతారంటే...
ఢిల్లీ కేంద్రంగా ఆగస్టు 2015లో సాహిల్ గోయెల్, గౌతమ్ కపూర్, నేను కలిసి దీన్ని ప్రారంభించాం. వ్యక్తిగత వర్తకులకు, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆన్‌లైన్లో ఉత్పత్తులను విక్రయించుకునే వేదికే క్రాఫ్ట్‌లీ. విక్రయదారులకు ఉత్పత్తుల కేటలాగ్, ఉత్పత్తుల ప్రదర్శన, ఆన్‌లైన్ మార్కెటింగ్, పేమెంట్ సొల్యూషన్స్, లాజిస్టిక్ సేవలను కూడా అందిస్తాం.
1,500 విభాగాలు, 70 లక్షల ఉత్పత్తులు..
ప్రస్తుతం క్రాఫ్ట్‌లీలో 17 వేల మంది విక్రయదారులు నమోదయ్యారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాషన్, జ్యుయెలరీ, హోమ్‌డెకర్, ఫుట్‌వేర్ వంటి 1,500 కేటగిరీల్లో సుమారు 70 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. ప్రతి రోజూ క్రాఫ్ట్‌లీ ద్వారా 10 వేల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ప్రతి ఉత్పత్తి అమ్మకంపై విక్రయదారుడి నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంటాం. వ్యాపారులు లేదా సంస్థలు కావాలంటే ఈ–కామర్స్ వేదికను అభివృద్ధి చేసిస్తాం. ఫీచర్లను బట్టి వీటి ధరలు రూ.3–15 వేల వరకూ ఉంటాయి.
త్వరలోనే మరో విడత నిధుల సమీకరణ..
ఈ ఏడాది ముగింపు నాటికి 5 మిలియన్ డాలర్ల ఆదాయంతో పాటు వచ్చే ఏడాది కాలంలో మరో లక్ష మంది విక్రయదారుల్ని నమోదు చేయాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. బెర్టెల్స్‌మెన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ (బీఐఐ), నిర్వాణా వెంచర్, బీనూస్, 500 స్టార్టప్స్ వంటివి ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగింపునాటికి మరో విడత నిధుల సమీకరణ చేస్తాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
చేనేత, హస్తకళలకు ప్రత్యేకం..
ఇటీవలే కేంద్ర ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్ (ఈపీసీహెచ్)తో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. ఈ ఎంవోయూతో ఇండియన్ హ్యాండ్‌లూమ్ బ్రాండ్ కింద చేనేతదారులు, హస్త కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తిదారులు నమోదయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది చేనేత, హస్తకళాకారులున్నారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...