నలభీముల వంట పండింది | Huge demand for non veg masters in andhra pradesh | Sakshi
Sakshi News home page

నలభీముల వంట పండింది

Published Mon, Jan 13 2025 3:43 AM | Last Updated on Mon, Jan 13 2025 3:43 AM

Huge demand for non veg masters in andhra pradesh

కోడి పందేల బరులు.. సంపన్నుల ఇళ్లు.. అతిథి గృహాల వద్ద వంటల్లో చేయి తిరిగిన వారికి భలే డిమాండ్‌

కొత్త అల్లుళ్ల స్పెషల్స్‌కు ప్రత్యేక నియామకాలు

నాన్‌వెజ్‌ మాస్టర్లకు భారీ డిమాండ్‌

సహాయకులకూ బంపర్‌ ఆఫర్లు

సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చిన వారికీ ఆదాయ మార్గాలు

కేవలం నాలుగు రోజులు వంట పని. ఉదయం సుమారు 500 మందికి టిఫిన్‌.. 1,500 నుంచి 2 వేల మందికి నాన్‌ వెజ్‌ వంటకాలతో మధ్నాహ్న, రాత్రి భోజనం.. సాయంత్రం స్నాక్స్‌. ఇవన్నీ చేయడానికి ఆరేడుగురు వంట మేస్త్రీలు, మాస్టర్లు, మహిళలు సహా పదిమందికి పైగా సహాయకులు. రోజుకు కనీసం రూ.50 వేల చొప్పున సంక్రాంతి పండుగ మొత్తం రూ.2 లక్షలకు మించి వెచ్చించే తరుణమిది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి–మాదలవారిగూడెం సమీపంలో కోడి పందేల బరివద్ద ఏర్పాట్ల కోసం ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన వారితో కుదుర్చుకున్న ఒప్పందమిది.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వంటల్లో చేయితిరిగిన నలభీములకు సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటవుతున్న బరుల వద్ద పైతరహా  ఒప్పందాలు జరిగాయి. సంప్రదాయ పిండి వంటలు, తీపి పదార్థాలు చేయడంలోనూ అనుభవజ్ఞుల పంట పండుతోంది. నాన్‌ వెజ్‌ వంటకాల్లో ప్రావీణ్యం ఉన్న ఒక్కో వంట మాస్టర్‌కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు సమకూరుతోంది. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో పనిచేస్తున్న మాస్టర్లు కొందరు స్వస్థలాలకు వెళ్లి వస్తామంటూ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుని వెళుతున్నారని ఆయా హోటళ్ల నిర్వాహకులు, యజమానులు చెబుతున్నారు. 

కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోసం
సంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లు, బంధువులు, స్నేహితులకు వివిధ రకాల విందు భోజనాలు ఏర్పాటు చేయాలని సంపన్న వర్గాల వారు తహతహలాడుతుంటారు. అల్లుళ్లకు మర్యా దలు చేయడంలో గోదారోళ్ల స్టైలే వేరు. కృష్ణా, గుంటూరు వాళ్లదీ అదే తీరు. వందల రకాలు వడ్డించడం వారికొక సరదా. గతేడాది ఏలూరు జిల్లాలో కొత్త అల్లుడికి 379 రకాల పదార్థాలు వడ్డించిన కుటుంబం వార్తల్లో నిలిచింది. వంద రకాలకు పైగా స్వీట్లు, నలభై రకాలకు మించి స్నాక్స్, నలభై రకాల కూరలు, ఇరవై రకాల చట్నీలు.. ఇలా విభిన్న పదార్థాలు విస్తరిలో వడ్డించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

ఇలాంటివి పలుచోట్ల చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, కొరమీను, మెత్తళ్లు, నల్లసందువా తదితర చేపలతో వెరైటీలు చేయగలిగిన వారిని సంపన్న కుటుంబాల వారు రోజుకు లేదా గుంపగుత్తగా రూ.వేలల్లో చెల్లించి నియమించుకుంటున్నారు. వారం నుంచి పక్షం రోజుల వరకు ఇళ్లల్లోనే ఉండి కావాల్సిన వెరైటీ వంటలు చేయాల్సి ఉంటుంది. రోజుకు వేతనం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారని, సహాయకుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారని పాలకొల్లుకు చెందిన కేటరింగ్‌ నిర్వాహకుడు మజ్జి శ్రీనివాస్‌ వివరించారు. 

దమ్‌ చేయడం తెలిస్తే..
మటన్, బికెన్‌ దమ్‌ బిర్యానీ చేయడంలో ఆరితేరిన వారికి మంచి డిమాండ్‌ ఉందని విజయవాడలో పలు హోటళ్లు నిర్వహిస్తున్న మనోహర్‌ ‘సాక్షి’కి చెప్పారు. ఏదైనా ఒక ఈవెంట్‌ కోసం 2 వేల మందికి స్పెషల్స్‌ చేయడానికి  మాస్టర్‌ రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకుంటారని, సంఖ్య అంతకు మించితే మరో మాస్టర్‌కు అంతే మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మాస్టర్లకు, వారి సహాయకులకు వసతి, భోజనం, రవాణా వసతి అదనం. వివాహాలు, ఈవెంట్ల కోసం రెండు రకాల వెరైటీ స్వీట్స్‌ చేసే వారికి కూడా మంచి డిమాండ్‌ ఉందని వివరించారు.

ఇతర జిల్లాల వారికీ డిమాండ్‌
పాలకొల్లు బంగారుచెరువు గట్టు ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కేటరింగ్‌ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో చాలామంది సంక్రాంతి కోడి పందేల బరులు, సంపన్నుల ఇళ్లు, అతిథి గృహాలు, విల్లాల వద్ద ప్రత్యేక వంటలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిపోయారు. 

⇒ కాకినాడ జిల్లా వేళంగి గ్రామం కూడా వంట మేస్త్రీలకు ప్రసిద్ధి. ఇక్కడ 150 మందికి పైగానే వంట మేస్త్రీలు ఉంటారు. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి విభిన్న రకాల వంటలు వండి వడ్డిస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికీ డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

⇒ భీమవరం సమీపంలోని చినఅమిరంలో ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసే వారున్నారు. ఎన్ని వెరైటీలు కావాలన్నా సమయానికి అందజేస్తారు. కాళ్ల మండపం కోపల్లె, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పిండి వంటలు తయారు చేసే మహిళలు ఎక్కువ. సంక్రాంతి రోజుల్లో ఆర్డర్లపై దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తుంటారు.

⇒ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పలు పేద కుటుంబాల వారు హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లోని విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఆఫీసుల వద్ద వాచ్‌మెన్‌లుగా కొనసాగుతుంటారు. సంక్రాంతి పండుగకు కుటుంబం మొత్తం స్వస్థలాలకు వారం, పది రోజులు ఉండేలా వస్తుంటారు. అలాంటి వారిలో ప్రావీణ్యమున్న వారు వంటలు చేయడానికి, సహాయకులుగా ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. 

⇒ వంటలు చేయడంలో ఆరితేరిన మేస్త్రీలు, సహాయకులకు ఇంతగా డిమాండ్‌ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ప్రావీణ్యమున్న పలువురు పండుగ సమయంలో తమ కుటుంబీకులు, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎంత డబ్బులు ఇస్తామన్నా వంట పనికి వెళ్లరు. దీంతో పనికి సిద్ధపడే వారు కొద్దిరోజులకే జాక్‌పాట్‌ కొట్టినట్టే.

వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం 
మా ముగ్గురు కుమారు ల కుటుంబ సభ్యు లతో పాటు బంధుమిత్రులు 40 మంది వరకు పండగ కు ఇంటికి వస్తుంటా రు. వారికి ఏ లోటూ లేకుండా అవసరమైన వంటలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా వంట మేస్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం. పనుల్లో వారికి మా కుటుంబ సభ్యులు సహకరిస్తుంటారు. వంట మేస్త్రీ ఒకరికి పండుగ మూడు రోజులకు రూ.10 వేలు వరకు ఇస్తాం.  – చవ్వాకుల సత్యనారాయణమూర్తి, ఆక్వా రైతు, తోలేరు, పశ్చిమ గోదావరి జిల్లా

ఇందుపల్లి వంటవారు ప్రత్యేకం
వంటలు చేయడంలో కృష్ణా జిల్లా ఇందుపల్లి వారికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇందుపల్లి వంటలకు ప్రాధాన్యమిచ్చి పిలిపించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాల వారి నుంచి పిలుపులు వచ్చాయని ఇందుపల్లి ఎంపీటీసీ సభ్యుడు, వంట మేస్త్రీ అయిన కూరాకుల వెంకట్రామయ్య తెలిపారు. తమ బృందం కూడా నాలుగు రోజుల వంటలకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement