పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు  | AP record in certification of Edex courses | Sakshi
Sakshi News home page

పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు 

Published Wed, Apr 24 2024 5:40 AM | Last Updated on Wed, Apr 24 2024 5:40 AM

AP record in certification of Edex courses  - Sakshi

ప్రపంచ దిగ్గజ సంస్థ.. ‘ఎడెక్స్‌’ కోర్సుల సర్టీఫికేషన్‌లో ఏపీ రికార్డు 

నెలలోనే 1.03 లక్షలకుపైగా సర్టిఫికేషన్లతో సత్తా 

ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల సర్టీఫికేషన్లనే అందిస్తున్న ఎడెక్స్‌ 

ఏడాదికి 12 లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 

ఎడెక్స్‌ కోర్సుల్లో 3 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌ 

వీరందరూ కోర్సులు చేయాలంటే బయట రూ.382 కోట్ల వ్యయం 

పైసా భారం పడకుండా ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్‌ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్‌ ద్వారా 260కిపైగా వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు, కంటెంట్‌ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్‌’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్‌ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్‌ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్‌ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం.   

1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. 
ఎడెక్స్‌ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి.  రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు.

ఎంఐటీ 320, హార్వర్డ్‌ 1,560, గూగుల్‌ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్‌ 770, ఏఆర్‌ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ 170, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ 700, స్టాన్‌ఫర్డ్‌ 2,200, ఫుల్‌ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్‌ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్‌ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది.  

సులభంగా ప్రవేశాలు.. 
ఎడెక్స్‌ ద్వారా మైక్రో మాస్టర్స్‌ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్‌ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. 

రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. 
ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్‌ కోర్సులకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్‌ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్‌ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్‌ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది.  

మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య 
అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్‌ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్‌ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం.      – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 
 
32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. 
మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్‌ చదువుతున్నా. నేను ఎడెక్స్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్,  ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్‌డ్‌ మెథడ్స్‌ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్‌ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్‌ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది.     – టి.మోక్షిత్‌ సాయి, బీటెక్‌ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, చిత్తూరు 

కర్టీన్‌ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్‌.. 
మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్‌ గ్రూప్‌ కోర్సు చేశాను. క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్‌ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్‌ సాధించాను.      – దూలం చందు, బీటెక్‌ (ఈఈఈ) 
 
స్పెయిన్‌ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. 
నేను ఉచితంగా ఎడెక్స్‌ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్‌ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్‌ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్‌ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.     – అర్వా నాగ సుజిత, బీటెక్‌ (ఈఈఈ),     రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, నంద్యాల  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement