2.05 లక్షల ఎకరాల్లో సాగు
రూ.793.67 కోట్లు సబ్సిడీగా ఇచ్చిన జగన్ సర్కారు
26 జిల్లాల్లో 75,035 రైతులకు ప్రయోజనం
2023–24 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడి
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సూక్ష్మ సేద్యం పరికరాలు రైతులకు ఇవ్వడం లేదని, సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించారంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విషయం అదే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఎలుగెత్తి చాటింది.
గత ఆర్థిక ఏడాదిలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచి్చనట్టు సర్వే తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రూ.793.67 కోట్లు సాయం అందించిందని, తద్వారా 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు ప్రయోజనం పొందారని సర్వే పేర్కొంది.
టాప్–20లో ఐదు జిల్లాలు ఏపీవే
2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య) ఏపీలోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండల ఇ–కొత్తపల్లి గ్రామ పంచాయతీ సూక్ష్మ సేద్యంలో ఉత్తమ పద్ధతులు, విధానాలను అమలు చేయడంతో ఆ గ్రామాన్ని ‘వన్ డ్రాప్.. మోర్ క్రాప్’ జాతీయ వర్క్‌షాపు ప్రశంసించిందని సర్వే పేర్కొంది.
సూక్ష్మ సేద్యం ప్రయోజనాలపై అధ్యయనం ప్రకారం 18 నుంచి 20 శాతం వరకు అదనపు విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు తేలిందని, అలాగే 35 నుంచి 60 శాతం ఉత్పాదకత పెరిగిందని, 35 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అయిందని, 40 నుంచి 45 శాతం ఎరువులు ఆదా అయ్యాయని, సాగు వ్యయం 18 శాతం తగ్గిందని, నికరాదాయం 75 శాతం పెరిగిందని సర్వే వివరించింది.
సూక్ష్మ సేద్యంతో నీరు, విద్యుత్, ఎరువులు, కూలీ వేతనాల్లో భారీ ఆదాతో పాటు అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొంది. సూక్ష్మ సేద్యంలో హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుందని, హెక్టార్‌కు రూ.1,15,000 అదనపు ఆదాయం వస్తుందని సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment