‘ఎడెక్స్‌’ కోర్సులకు మంగళం! | Edex free courses deal ends today | Sakshi
Sakshi News home page

‘ఎడెక్స్‌’ కోర్సులకు మంగళం!

Published Fri, Feb 14 2025 5:09 AM | Last Updated on Fri, Feb 14 2025 5:08 AM

Edex free courses deal ends today

గత ఏడాది ఫిబ్రవరిలో ఎడెక్స్‌తో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒప్పందం

12 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు మేలు చేసేలా ప్రణాళిక 

గతేడాది జూన్‌ వరకు 3.20 లక్షల మంది కోర్సులు పూర్తి

జగన్‌పై అక్కసుతో కోర్సులపై కూటమి సర్కారు నిర్లక్ష్యం

మరో 8 లక్షల మంది చదువుకునే అవకాశం ఉన్నా ప్రోత్సహించని ప్రభుత్వం 

నేటితో ముగుస్తున్నఎడెక్స్‌ ఉచిత కోర్సుల ఒప్పందం

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మేలు జరిగేలా అందుబాటులోకి తెచ్చిన ‘ఎడెక్స్‌’ సర్టిఫికేషన్‌ కోర్సులు నిలిచిపోనున్నాయి. విద్యా సంస్కరణల్లో భాగంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోవాలన్న ఉన్నతాశయంతో అందుబాటులోకి తెచ్చిన ఈ కోర్సులను టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్‌పై అక్కసుతో అటకెక్కిస్తోంది. దీంతో రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు మేలు చేసే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల సర్టిఫికేషన్‌ కోర్సులు దూరం కానున్నాయి. 

సరిగ్గా ఏడాది క్రితం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకుని రెండువేల కోర్సులను వర్చువల్‌గా చదువుకునే అవకాశాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించింది. నాలుగు నెలలకు 4 లక్షల మంది చొప్పున ఏడాదిలో 12 లక్షల మందికి మేలుచేయాలన్న లక్ష్యంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ కోర్సులు అందుబాటులోకి రాగా, తొలి నాలుగు నెలల్లో 3.83 లక్షల మంది ఎన్‌రోల్‌ అయ్యి.. 3.20 లక్షల మంది కోర్సులు పూర్తిచేశారు. 

జూన్‌లో కూటమి ప్రభుత్వం రాగానే ఎడెక్స్‌ కోర్సులను నిర్లక్ష్యం చేయడంతో పాటు విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించలేదు. దీంతో ప్రభుత్వం డబ్బులు చెల్లించి అందుబాటులోకి తెచ్చిన కోర్సులు విద్యార్థులకు చేరువ కాలేకపోయాయి. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో రెండువేల సర్టిఫికెట్‌ కోర్సులు కూడా విద్యార్థులు చేయలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. 

12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేసేలా అందుబాటులోకి తెచ్చిన కోర్సులు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం 3.20 లక్షల మందికే పరిమితమయ్యాయి. ఎడెక్స్‌తో జరిగిన ఒప్పందం ఇక శుక్రవారంతో ముగియనుంది. – సాక్షి, అమరావతి

ఉచితంగా వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీ కోర్సులు..
ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా చోటుచేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్న­­­ద్ధం చేస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందుబా­టు­లోకి తెచ్చింది. 

ఒక్కో కోర్సుకు సుమారు రూ.30 వేలు ఖర్చయ్యే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఏడాది క్రితం ఒప్పందం చేసు­కుంది. పాఠ్య ప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్‌ను చదువుకునే అవకాశం కల్పించి, 2024 ఫిబ్ర­వరి 16 నుంచి వర్సిటీల్లో అందుబా­టులోకి తెచ్చారు. 

ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ఫారం అయిన ఎడెక్స్‌ ద్వారా 180కి పైగా వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని రెండువేలకు పైగా వర్టికల్స్‌ను విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు. ఇక ఎడెక్స్‌ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్‌మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్‌ అందిస్తుంది. 

రాత పరీక్షను ఎడెక్స్‌ రూపొందించిన ప్రశ్నపత్రాలతో మన వర్సిటీలే నిర్వహిస్తున్నాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తున్నాయి. విద్యార్థి ఆసక్తి మేరకు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేసే వెసులుబాటు ఉంది. వాటిని వేల్యూ యాడెడ్‌ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఉద్యోగ, ఉపాధిలో కీలకమైన కోర్సులకు మంగళం..
ఇక ఎడెక్స్‌ ద్వారా రెగ్యులర్‌ కోర్సులు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న మార్కెట్‌ ఓరియంటెడ్‌ కోర్సులనే అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, పైథాన్‌ వంటి కోర్సులకు వర్తమాన ప్రపంచంలో బాగా డిమాండ్‌ ఉంది. 

ఇవేగాక.. ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల ఫ్యాకల్టీ తరగతులను మన విద్యార్థులు వినే అవకాశం గత ప్రభుత్వం కల్పించింది. తద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు కోరుకున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు వారికి అందించింది. ఇందులో భాగంగా.. ఏడాది కాలానికి నాలుగు లక్షల లైసెన్సులు తీసుకుని, రెండువేల కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. నాలుగు నెలలను ఒక సెమిస్టర్‌గా 12 నెలలకు మూడు సెమిస్టర్ల రూపంలో అమలుచేసింది. 

ఒక సెమిస్టర్‌లో 4 లక్షల మంది విద్యార్థులకు లైసెన్సు అందుబాటులో ఉంచింది. వీరి తర్వాత రెండో సెమిస్టర్‌ మరో 4 లక్షల మందికి అందిస్తారు. ఇలా ఒక్కో విద్యార్థి నాలుగు నెలల్లో రెండు వేల కోర్సుల్లో ఎన్ని కోర్సులైనా చేసుకునే అవకాశం కల్పించింది. నిజానికి.. మార్కెట్‌లో ఒక్కో కోర్సు లైసెన్సు రూ.30 వేల వరకు ఉండగా గత ప్రభుత్వం రూ.వెయ్యికే పొందింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్‌ నుంచి రెండు, మూడు సెమిస్టర్లకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించలేదు. దీంతో.. గత ప్రభుత్వం చేపట్టిన విద్యా యజ్ఞం బూడిదలో పోసిన పన్నీరైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement