Edex
-
‘ఎడెక్స్’ కోర్సులకు మంగళం!
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మేలు జరిగేలా అందుబాటులోకి తెచ్చిన ‘ఎడెక్స్’ సర్టిఫికేషన్ కోర్సులు నిలిచిపోనున్నాయి. విద్యా సంస్కరణల్లో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోవాలన్న ఉన్నతాశయంతో అందుబాటులోకి తెచ్చిన ఈ కోర్సులను టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్‌పై అక్కసుతో అటకెక్కిస్తోంది. దీంతో రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు మేలు చేసే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల సర్టిఫికేషన్ కోర్సులు దూరం కానున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకుని రెండువేల కోర్సులను వర్చువల్‌గా చదువుకునే అవకాశాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. నాలుగు నెలలకు 4 లక్షల మంది చొప్పున ఏడాదిలో 12 లక్షల మందికి మేలుచేయాలన్న లక్ష్యంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ కోర్సులు అందుబాటులోకి రాగా, తొలి నాలుగు నెలల్లో 3.83 లక్షల మంది ఎన్రోల్ అయ్యి.. 3.20 లక్షల మంది కోర్సులు పూర్తిచేశారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం రాగానే ఎడెక్స్ కోర్సులను నిర్లక్ష్యం చేయడంతో పాటు విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించలేదు. దీంతో ప్రభుత్వం డబ్బులు చెల్లించి అందుబాటులోకి తెచ్చిన కోర్సులు విద్యార్థులకు చేరువ కాలేకపోయాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో రెండువేల సర్టిఫికెట్ కోర్సులు కూడా విద్యార్థులు చేయలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేసేలా అందుబాటులోకి తెచ్చిన కోర్సులు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం 3.20 లక్షల మందికే పరిమితమయ్యాయి. ఎడెక్స్‌తో జరిగిన ఒప్పందం ఇక శుక్రవారంతో ముగియనుంది. – సాక్షి, అమరావతిఉచితంగా వరల్డ్ క్లాస్ వర్సిటీ కోర్సులు..ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా చోటుచేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కోర్సుకు సుమారు రూ.30 వేలు ఖర్చయ్యే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏడాది క్రితం ఒప్పందం చేసుకుంది. పాఠ్య ప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్ను చదువుకునే అవకాశం కల్పించి, 2024 ఫిబ్రవరి 16 నుంచి వర్సిటీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ–లెర్నింగ్ ప్లాట్ఫారం అయిన ఎడెక్స్ ద్వారా 180కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని రెండువేలకు పైగా వర్టికల్స్‌ను విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు. ఇక ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నపత్రాలతో మన వర్సిటీలే నిర్వహిస్తున్నాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తున్నాయి. విద్యార్థి ఆసక్తి మేరకు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేసే వెసులుబాటు ఉంది. వాటిని వేల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.ఉద్యోగ, ఉపాధిలో కీలకమైన కోర్సులకు మంగళం..ఇక ఎడెక్స్ ద్వారా రెగ్యులర్ కోర్సులు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులనే అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, పైథాన్ వంటి కోర్సులకు వర్తమాన ప్రపంచంలో బాగా డిమాండ్ ఉంది. ఇవేగాక.. ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల ఫ్యాకల్టీ తరగతులను మన విద్యార్థులు వినే అవకాశం గత ప్రభుత్వం కల్పించింది. తద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు కోరుకున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు వారికి అందించింది. ఇందులో భాగంగా.. ఏడాది కాలానికి నాలుగు లక్షల లైసెన్సులు తీసుకుని, రెండువేల కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. నాలుగు నెలలను ఒక సెమిస్టర్గా 12 నెలలకు మూడు సెమిస్టర్ల రూపంలో అమలుచేసింది. ఒక సెమిస్టర్లో 4 లక్షల మంది విద్యార్థులకు లైసెన్సు అందుబాటులో ఉంచింది. వీరి తర్వాత రెండో సెమిస్టర్ మరో 4 లక్షల మందికి అందిస్తారు. ఇలా ఒక్కో విద్యార్థి నాలుగు నెలల్లో రెండు వేల కోర్సుల్లో ఎన్ని కోర్సులైనా చేసుకునే అవకాశం కల్పించింది. నిజానికి.. మార్కెట్లో ఒక్కో కోర్సు లైసెన్సు రూ.30 వేల వరకు ఉండగా గత ప్రభుత్వం రూ.వెయ్యికే పొందింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్ నుంచి రెండు, మూడు సెమిస్టర్లకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించలేదు. దీంతో.. గత ప్రభుత్వం చేపట్టిన విద్యా యజ్ఞం బూడిదలో పోసిన పన్నీరైంది. -
ఎడెక్స్‌తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం
ఏయూక్యాంపస్: ప్రతిష్టాత్మకమైన ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్ర యువతకు వరంగా నిలుస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఎడెక్స్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ‘థాంక్యూ సీఎం సార్..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యువత పోటీపడాలని, ఇందుకనుగుణంగా విద్య ప్రమాణాలు, సామర్థ్యాలను పెంపొందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాటిని యువత సద్వినియోగం చేసుకుంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ మన విద్యార్థులు ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కోర్సులు చదివి సర్టిఫికేషన్ పొందే అవకాశం నేడు లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, విద్య విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య.. ఒక హక్కు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం. కానీ.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం అని అన్నారాయన. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారాయన. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని అన్నారాయన. .అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు.మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్ సిటిజెన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు. అందుకనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. అక్కడితో మనం ఆగిపోలేదు. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. వాళ్లు మన ఎస్సీఈఆర్టీలో భాగమై.. ఈ ఏడాది టీచర్లకు సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెడతారు. ఈ ఏడాది టీచర్ల సామర్ధ్యం పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు వచ్చే ఏడాది ఒకటో తరగతి, ఆ తర్వాత రెండో తరగతి ఇలా.. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతాం. 6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ... ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చాం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఉన్నతవిద్యలో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజెన్స్‌గా తయారవుతారు. ప్రపంచంతో పోటీపడతారు. ఉన్నతవిద్యారంగం మీద ఈ ఐదుసంవత్సరాల మీద పెట్టిన ధ్యాస ఇంతకముందు ఎవరికీ ఊహకు కూడా అందని విధంగా ధ్యాసపెట్టి అడుగులు వేయించగలిగాం. మొట్టమొదటిసారిగా పిల్లలు కచ్చితంగా చదవాలి, వారి చదువులకు పేదరికం అడ్డురాకూడని అడుగులు వేశాం. దీనికోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్ –జూలైలోనూ, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. దాదాపు 30శాతం కోర్సులు స్కిల్ ఓరియెంటెడ్‌గా మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు తీసుకువచ్చాం. తొలిసారిగా మూడేళ్ల కోర్సులో కూడా ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేస్తున్నాం. మూడేళ్ల కోర్సుతో పాటు ఇంకో ఏడాది హానర్స్డిగ్రీ ఇచ్చే విధంగా తీసుకువచ్చాం. తొలిసారిగా 400 పైగా బైలింగువల్ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి. ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశాం. అందులో భాగంగానే ఇవాళ వేస్తున్న ఇంకో గొప్ప అడుగు ఎడ్‌క్స్‌తో ఈ రోజు మనం చేస్తున్న ఒప్పందం. దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్ వంటి వర్టికల్స్ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయి. మన దగ్గర ఇవేవీ కనిపించవు. ఇటువంటివి నేర్పించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రెండోది ఇటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం కూడా మరో కారణం. ఈ రెండింటిని కూడా బ్రిడ్జ్ చేస్తూ.. ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే... ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నాం. ఇది పెద్ద మార్పు. దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్, వెల్త్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా 12లక్షల మంది విద్యార్ధులకు 2వేలకు పైగా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన యూనివర్సిటీలలో మన పాఠ్యప్రణాళికలో భాగంగా అవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని మన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటిలో విద్యార్ధి తనకు కావాల్సిన వర్టికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు ఉండడం వల్ల ఉద్యోగ సాధన మరింత సులభం అవుతుంది. గతంలో అన్ని యూనివర్సిటీల వీసీలకు ఇదే మాట చెప్పాను. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3డి లెర్నింగ్ వంటి వాటిని మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేగలుగుతాం. మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. విద్యను ఏ స్ధాయిలో ప్రోత్సహిస్తున్నామంటే.. టాప్ –50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్‌లో ఉన్న 320 కాలేజీలలో సీటు వస్తే.. రూ.1.25 కోట్ల వరకు ప్రభుత్వమే ఫీజులు కట్టి చదవిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా వినియోగించుకుని ఇప్పటికే వినియోగించుకున్నారు. అందరికీ ఆ రకంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు, ప్రతి యూనివర్సిటీలలో ఆ యూనివర్సిటీలనే, ఆ సబ్జెక్టులనే తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నమే ఈ ఎడ్‌క్స్‌తో చేసుకుంటున్న ఒప్పందం. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా.. ఆ కోర్సులు మన యూనివర్సిటీలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు. నాణ్యమైన విద్య మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. ప్రతి వైస్ ఛాన్సలర్‌కి చెబుతున్నాను. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఆన్లైన్ కేపబులిటీని పెంచాలి. మన దగ్గర రిజిస్ట్రేషన్లు బాగా జరిగేలా చూడాలి. పద్మావతి యూనివర్సిటీలో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్ధాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు.యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇది ప్రారంభం. ఇటువంటి చర్యలు ప్రతి యూనివర్సిటీ తీసుకోవాలి. టెక్నాలజీని మన పిల్లలకు తీసుకునిరావాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్యకు అందించగలుగుతాం. ఆ దిశగా వీసీలు మందడుగు వేయాలి. కార్యక్రమంలో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ ఎంఓయూ చేసుకుంటున్నాం’ అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. .. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది. 12 లక్షల మందికి లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది. -
'సూపర్-30'కి సూపర్ అవకాశం!
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ పరీక్షలకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సూపర్-30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ను ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం 'ఎడ్ఎక్స్' గణితశాస్త్రం బోధించాలని ఆహ్వానించింది. ఈ వెబ్ సైట్ ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎమ్ఐటీ ప్రొఫెసర్ అనంత అగర్వాల్.. ఆనంద్ కు లేఖ రాశారు. 'ఎడ్ఎక్స్' కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తోందని, ఎడ్ఎక్స్, సూపర్-30 కలిసి పనిచేయడం వల్ల ప్రపంచంలో ఎక్కువమంది విద్యార్థులు లాభపడతారని ఆయన లేఖలో చెప్పారు. లేఖపై స్పందించిన ఆనంద్ కుమార్ ఎమ్ఐటీ, హార్వర్డ్ లాంటి విద్యాసంస్థలు సూపర్-30ని తమతో కలుపుకుపోవాలని అనుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎడ్ఎక్స్ లాంటి సంస్థలు పేదల కోసం విద్యను అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. కచ్చితంగా ఎడ్ఎక్స్ తో కలిసి నడుస్తానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఏ మేరకు సాయం చేయగలనో ముందు ముందు చూడాలని అన్నారు. ఆనంద్ కుమార్ కు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సీటు దొరికినా ఆర్ధిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. 2002లో సూపర్-30ని ప్రారంభించిన ఆనంద్ ఐఐటీలో చేరేందుకు ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే.