సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎడెక్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.
.. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది.
12 లక్షల మందికి లబ్ధి
ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్‌లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు.
ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment