ధాన్యం సేకరణలో పశ్చిమ బెస్ట్
ఏలూరు : ధాన్యం సేకరణ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కోసం పటిష్టమైన విధానాన్ని అవలంభిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో ఫోన్‌లో మాట్లాడి ఇదే విధానాన్ని అన్ని జిల్లాలు అనుసరించేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు.
కలెక్టర్ కాటంనేని భాస్కర్, జేసీ బాబురావునాయుడు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో గ్రామాలవారీ ప్రణాళికను సిద్ధం చేశారని, ఇతర జిల్లాలు కూడా అనుసరిస్తే ప్రజావసరాలు కోసం కావాల్సిన బియ్యాన్ని మనమే సమకూర్చుకోగలుగుతామని రాజశేఖర్ మంత్రికి వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో ఆన్‌లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. రైస్‌మిల్లర్స్ కూడా ప్రభుత్వంతో సహకరించి మంచి నాణ్యత గల ధాన్యాన్ని సేకరించేందుకు దోహదం చేయాలని కమిషనర్ కోరారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో ఏ-గ్రేడ్ బియ్యాన్ని ప్రత్యేక గోదాముల్లో భద్రపరచాలని, జిల్లాలో చౌకడిపోల ద్వారా రూ.1 కే కిలో బియ్యాన్ని అందిస్తామన్నారు. అదే విధంగా హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని నిర్ణయించామన్నారు.
22 వేల దీపం కనెక్షన్లు మంజూరు
రాష్ట్రంలోని గిరిజనులందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేస్తామని రాజశేఖర్ చెప్పారు. జిల్లాలో దీపం పథకం కింద కొత్తగా 22 వేల వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. సమావే శంలో జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు. జిల్లా పౌరసరఫరాల అధికారి డి.శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
చింతలపూడి : రాష్ట్రంలో ఇప్పటివరకు 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తెలిపారు. చింతలపూడి ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తీసుకుంటున్న జాగ్రత్తలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వరి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట జేసీ టి.బాబూరావునాయుడు, డీఎస్‌వో శివశంకర్‌రెడ్డి, డీఎం వసంతరావు, ఏజీ డీఎం సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ మైఖేల్‌రాజ్ పాల్గొన్నారు.