ధాన్యం కొనుగోలును మొక్కుబడిగా చేస్తున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న వరి పంట 3లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిన దిగుబడి ఇప్పటివరకు ప్రభుత్వం కొన్న ధాన్యం 32,626 టన్నులు ఒక్క టన్ను కూడా బుడ్డలు కొనని వైనం తాజాగా బుడ్డలు కొనుగోలు చేయాలంటూ ఆదేశం 30వేల టన్నులు మాత్రమే కొంటామంటూ ప్రకటన ఆందోళనలో అన్నదాతలు రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. జిల్లావ్యాప్తంగా 3లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 75 వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం (1010), మిగిలిన 2.25లక్షల మెట్రిక్ టన్నుల (ఏడీటీ-37) రకం ధాన్యం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 32,626 టన్నుల సన్నాలు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఒక క్వింటాలు కూడా బుడ్డలు కొనుగోలు చేయలేదు. బుధవారం నుంచి బుడ్డలను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా, కేవలం 30వేల టన్నులు మాత్రమే కొంటామని ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం మాట తప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు: జిల్లావ్యాప్తంగా రైతులు ఈ ఏడాది వరి పంటను అధికంగా సాగుచేశారు. నవంబర్‌లో భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35వేల హెక్టార్లు కాగా 82వేల హెక్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో వరి కోతలు మొదలయ్యాయి. 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది. ధాన్యం బాగా పండితే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట చాలామేరకు దెబ్బతింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంటలో సైతం దిగుబడి సగానికి సగం తగ్గినట్లు తెలుస్తోంది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తిస్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 3లక్షల టన్నుల్లో 75వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం ధాన్యం ఉండగా, 2.25లక్షల మెట్రిక్ టన్నుల బుడ్డల రకం ధాన్యం ఉంది.
సన్నాలు మాత్రమే కొన్న ప్రభుత్వం
ప్రభుత్వం రైతులు అధికంగా సాగుచేసిన ఏడీటీ-37 రకం (బుడ్డలు) ధాన్యం కొనలేదు. కేవలం సన్నాలు రకం మాత్రం అరకొరగా కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 17కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్‌కు రూ.1,450 చొప్పున 36,626 టన్నుల ధాన్యం కొన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది నామమాత్రపు కొనుగోలు కిందే లెక్క. రైతులు అత్యధికంగా పండించిన బుడ్డలు రకం ధాన్యాన్ని ఒక్క కింట్వాల్ కూడా కొనుగోలు చేయలేదు. పైగా తెగుళ్లు సోకడంతో బుడ్డల రకం ధాన్యం పనికి రాకుండా పోయిందని, ధాన్యం కొనుగోలు చేసినా నూక తప్ప బియ్యం వచ్చే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 12 టన్నుల బుడ్డలు కొని మిషన్ ఆడించి పరిశీలించగా మొత్తం నూక వస్తోందని, దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి బుడ్డల కొనుగోలుకు ప్రత్యేక అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. బయ ట మార్కెట్‌లో బుడ్డలు కొనేవారు కరువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు అధికంగా పెట్టి ఆరుగాలం శ్రమించినా వరి తెగుళ్ల బారిన పడి సగానికి సగం కూడా దిగుబడి రాలేదని ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యం అయినా ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎఫ్‌సీఐకి బుడ్డలు.. కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
జిల్లాలో పండిన బుడ్డలు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని విజయవాడ ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించింది. అక్కడ ధాన్యాన్ని బాయిల్ చేసి ఎఫ్‌సీఐకు తరలించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం విజయవాడ రైస్ మిల్లర్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం నుంచి బుడ్డల రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి జయరాములు ‘సాక్షి’కి తెలిపారు. అయితే జిల్లావ్యాప్తంగా దాదాపు 2లక్షల టన్నులు బుడ్డల ధాన్యం ఉండగా కేవలం 30వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో మిగిలిన ధాన్యాన్ని రైతులు ఎక్కడ ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకుంది. మరోవైపు బయట మార్కెట్ లో బుడ్డల రకం ధాన్యం ధర తక్కువ ఉంది. క్వింటాల్ రూ.800 మించి కొనే పరిస్థితి లేదు. ధాన్యాన్ని కొంటామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.