సాక్షిప్రతినిధి, నల్లగొండ :దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం సేకరణ (లెవీ) విధానం ఒకే విధంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు.. ఇటు చిన్నమిల్లర్లకు ఆశనిపాతంగా మారనుంది. పాత పద్ధతి ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75శాతం ప్రభుత్వానికి లెవీగా పెట్టేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విధానంలో కేవలం 25శాతం మాత్రమే లెవీగా సేకరించనున్నారు. దీంతో మిల్లర్లు ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కంటే, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసే ధాన్యమే ఎక్కువ. గ్రామాల్లో వరి కల్లాల వద్ద నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మొత్తం చేరేది కూడా మిల్లులకే. లెవీ తగ్గింపుల వల్ల అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం మిల్లర్లకు ఉండదు.
ప్రతికూల పరిస్థితులనుంచి బయటపడేందుకే..
దేశ వ్యాప్తంగా లెవీ సేకరణ అధికంగా జరుగుతోందని, దీనివల్ల అధిక నిల్వలు పేరుకు పోవడం, వృథా పెరగడం, కేంద్రం నిధులు ఎక్కువగా వినియోగించాల్సి రావడం, ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వాల్సి రావడం వ ంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడేందుకు లెవీ సేకరణ తగ్గిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి దాకా కస్టమ్ మిల్లింగ్, 30శాతం నుంచి 75శాతం వరకు మిల్లరునుంచి లెవీ సేకరణ జరుగుతోంది. మన రాష్ట్రంలో మాత్రం 75శాతం లేవీ సేకరణ అమలులో ఉంది. నూతన లేవీ విధానంలో రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని పాత పద్ధతిలోనే 75శాతం, లేదంటే కనీసం 50శాతం లేవీ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
అయినా, ఇది సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందని, దీంతో ఇటు మిల్లర్లకు, అటు రైతులకు ఇబ్బంది తప్పదని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 350రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో ఆధునిక టెక్నాలజీవి 150 వరకు ఉండగా, చిన్నాచితకవి 200 వరకు ఉన్నాయి. అదే విధంగా 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 24.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇక, ముందు ఇంతస్థాయిలో సేకరణ జరిగే వీలులేదు. లేవీ 25 శాతం లెవీ పెట్టి, బహిరంగ మార్కెట్‌లో 75శాతం విక్రయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆధునిక టెక్నాలజీ లేని మిల్లులు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు, ప్రభుత్వం నుంచి అమితుమీ తేల్చుకునేందుకు సోమవారం కోదాడలో రాష్ట్రస్థాయి మిల్లర్ల సమావేశం జరగనుంది.
కొత్త విధానంతో ఇవీ..నష్టాలు
పాత లెవీ విధానంలో మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం ప్రభుత్వం లెవీగా తీసుకునేది.
నూతన లెవీ విధానం వల్ల మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో లెవీగా 25శాతం తీసుకోనున్నారు.
కొత్త విధానం వల్ల రైతులకు, మిల్లర్లకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలుచేయరు. దీంతో మద్దతు ధర లభించే అవకాశం లేదు.
ప్రభుత్వ గోదాములు తక్కువగా ఉండటం వల్ల సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. అటు మిల్లర్లు కొనుగోలు చేయక, ఇటు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ.
లో టెక్నాలజీ ఉన్న మిల్లులు బియ్యం విక్రయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడతారు.
ఉత్తమ టెక్నాలజీ ఉన్న మిల్లుల్లో కూడా బియ్యం ఉత్పత్తి పెరగడం కూడా బహిరంగ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది.
రైతులకు, మిల్లులకు తీరని నష్టం
కేంద్ర తెచ్చిన లెవీ విధానం వల్ల రైస్‌మిల్లర్లకు, రైతులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీ రూపంలో మిల్లర్ల నుంచి కొనుగోలు చేసేది. ప్రస్తుతం 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో మిల్లర్లు ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్ల వద్ద ప్రభుత్వం లెవీ రూపంలో తీసుకుంటేనే కుదురుతుంది. బియ్యానికి డిమాండ్ లేనప్పుడు, సరైన ధర మార్కెట్‌లో లభించదనుకున్న సమయంలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం ఆశించిన మేరకు ఉండదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించదు. డిమాండ్ ఉంటేనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు సిద్ధపడతారు. మిల్లులు కూడా మూతపడే పరిస్థితి వస్తుంది.
- గంపా నాగేందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు
కొంపముంచనున్న..కొత్త లెవీ!
Published Mon, Oct 6 2014 2:41 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement