గోదాములు ఫుల్
నల్లగొండ, న్యూస్‌లైన్ :జిల్లాలో వెల్లువెత్తిన ధాన్యం దిగుబడులు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల సంస్థ గుండెల్లో గుబులు రెకేత్తిస్తున్నాయి. అధికార యంత్రాంగం ముందుచూపు లేకపోవడం.. నేడు అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. జిల్లాలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులో ఉన్నా, వాటిల్లో సామర్థ్యానికి మించి బియ్యం, గోధుమల నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యం, ఈ సీజన్‌లో సేకరించాల్సిన లేవీ బియ్యం దాచేందుకు గోదాముల్లో అంగుళం స్థలం కూడా ఖాళీ లేదు. 2013-14కు గాను మిల్లర్ల నుంచి 8 లక్షల టన్నుల లేవీ బియ్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల టన్నులు పూర్తయ్యాయి.
ఇవిగాక రబీ సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ 3.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంత పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడంతో వాటిని నిల్వ ఉంచేం దుకు మిల్లర్ల వద్ద కూడా స్థలం లేకుండా పోయింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి 2.50లక్షల టన్నుల బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించాల్సి ఉంది. లేవీ, కస్టమ్ మిల్లింగ్ కలిపి మొత్తం 6.50లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి సేకరించి గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలుపేరుకుపోవడంతో సివిల్ సప్లయీస్, ఎఫ్‌సీఐ సంస్థలు బిక్కమొహం వేస్తున్నాయి.
గోదాముల్లో పరిస్థితి ఇదీ..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 16 గోదాములు ఉన్నాయి. వీటిలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికిగానూ ఏకంగా 29.47 లక్షల టన్నుల ధాన్యాన్ని, గోధుమలను నిల్వ చేశారు. ఇంకా స్థలం చాలకపోవడంతో గోదాముల వెలుపల 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు ఖాళీ ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా గోధుములు 34,469 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఇదిలా ఉంటే ప్రతిరోజూ ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి (కస్టమ్ మిల్లింగ్) గోదాములకే తరలిస్తున్నారు. దీంతో రోజుకు 8 నుంచి 9 లక్షల టన్నుల వరకు బియ్యం గోదాములకు వచ్చి చేరుతోంది.
రేక్‌ల కోసం ఎదురుచూపులు...
జిల్లాలో నిల్వలను తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు తరలించేందుకు దక్షిణమధ్య రైల్వే రేక్‌లను అనుకున్న విధంగా కేటాయించడం లేదు. వాస్తవానికి జిల్లాలోని లక్ష టన్నుల బియ్యాన్ని జూన్ మొదటి వారంలోనే పక్క రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా 12 రేక్‌లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు నాలుగు రేక్‌ల ద్వారా కేవలం 13వేల టన్నులు మాత్రమే తరలించారు. అయితే గోదాముల్లో బియ్యం నిల్వలు తరలించేందుకు అదనంగా 20 రేక్‌లు కేటాయించాలని, దాంతోపాటు అదనంగా గోదాములు అద్దెకు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఆమోదంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. పై నుంచి రేక్‌లు కేటాయిస్తూ..అప్పటివరకు ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకునేందుకు వీలుగా అనుమతులు వస్తే తప్ప రబీ బియ్యం దాచే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.