కొందామంటే..
సాక్షి, ఏలూరు : ఏటా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ధాన్యానికి సంబంధించిన సొమ్ము చెల్లించటంలో అధికారులు జాప్యం చేయడం దీనికి బలం చేకూ రుస్తోంది. సకాలంలో సొమ్ము చెల్లించకపోవడం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్న ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలుకు ముందుకు రావటం లేదు. దీంతో ఈ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని 35 మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు 5 మండలాల్లోని 6 కేంద్రాల్లో మాత్ర మే కొనుగోళ్లు జరిగాయి. బకాయిలు చెల్లిస్తే తప్ప ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు చేయలేమని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు బకాయిపడ్డ సొమ్ము వెంటనే చెల్లించాలని కేంద్రాల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న గ్రామ సంఘాల సభ్యులు అధికారులను కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి నెలన్నర దాటినా సొమ్ము చెల్లించకపోవడంతో తమపై రైతులు తీవ్రంగా వత్తిడి తెస్తున్నారని వారు చెబుతున్నారు. సొమ్ము రావటానికి మరో 15 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని సభ్యులు వాపోతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు రాకపోవడంతోరైతులు కమిషన్‌దారులను ఆశ్రయిస్తున్నారు.
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటమే కానీ సేక రణలో విఫలమవుతూనే ఉన్నాయి.
2012 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. దిగుబడి అంచనా 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట ‘నీలం’ తుపాను ధాటికి నీటిపాలైంది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు. మిగిలిన ధాన్యాన్ని కొనేందుకు జిల్లాలో 72 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 28 కేంద్రాలు మాత్రం కేవలం 7వేల 301 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాయి. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో వరి పండించారు. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి అంచనా 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే.
2013 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అకాల వర్షాలకు దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది రబీలో జిల్లాలో ఇప్పటివరకూ రూ.3.36 కోట్ల విలువైన 22వేల 583 క్వింటాళ్ల ధాన్యం, రూ.1.36కోట్ల విలువైన 11వేల 958 క్వింటాళ్ల మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యం రైతులకు రూ.1.36 కోట్లు, మొక్కజొన్న రైతులకు రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారు. రూ. 2.76 కోట్ల బకాయిలు ఉన్నాయి.
సొమ్ము పౌరసరఫరాల శాఖ నుంచి రావాలి : డీఆర్‌డీఏ పీడీరైతులకు చెల్లించాల్సిన సొమ్ము పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సి ఉందని డీఆర్‌డీఏ పీడీ పి.శ్రీనివాసరావు చెప్పారు. ఆ శాఖ నుంచి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామన్నారు.
బకాయి సొమ్ము కోసం 40 రోజులుగా తిరుగుతున్నాం
ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశాం. ఇప్పటి వరకూ రూ.58 లక్షల 73వేల 561 విలువైన ధాన్యం సేకరించాం. ఇందులో మే నెల 27న కొంతసొమ్ముకు సరిపడా చెక్కులు ఇవ్వగా, ఇంకా రూ.34 లక్షల 73వేల 561 బకాయి ఉంది. బకాయి సొమ్ము కోసం ఏలూరులోని డీఆర్‌డీఏ కార్యాలయం చూట్టూ 40 రోజులుగా తిరుగుతున్నాం. అధికారులు మా కమిషన్ చెల్లింపులోను అలక్ష్యం వహిస్తున్నారు. గత రబీ సీజన్‌లో సుమారు రూ.5 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం. -లింగాల కాంతమ్మ, గ్రామసంఘం-1 అధ్యక్షురాలు, రాజవరం, కొయ్యలగూడెం మండలం