సాక్షి, ఏలూరు :ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ఇచ్చిన హామీల్లో డ్వాక్రా రుణాల మాఫీ ఒకటి. ప్రతి నెల క్రమం తప్పకుండా రుణ వాయిదాలను బ్యాంకులకు కట్టేసే స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ హామీని నమ్మి రుణాలు తిరిగి చెల్లించడం మానేశారు. మూడు నెలలుగా బకాయిపడ్డారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే ఆ హామీ అమలుపై అనేక అనుమానాలకు తావిచ్చేలా టీడీపీ అధినేతల వైఖరి కనిపిస్తుండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. రుణం మాఫీ చేయకపోతే ఇప్పటి వరకూ కట్టని వాయిదాలను ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తే వడ్డీ లేకుండాను, చెల్లించలేకపోతే 12 నుంచి 15 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. దాని వల్ల అప్పుల పాలవుతామని
వారు భయపడుతున్నారు. జిల్లాలో సుమారు 10 లక్షల కుటుంబాలుండగా లక్షా 61 కుటుంబాలు డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం కలిగిఉన్నాయి. 6.45లక్షల మంది సభ్యులతో 61వేల 120 సంఘాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలు రూ.925 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిలో 8వేల మహిళా సంఘాలకు సంబంధించి రూ.98 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. రుణ మాఫీ జరిగితే ఇవన్నీ రద్దవుతాయి. రుణ మాఫీ అమలులో సాధ్యమైనంత వరకూ భారం తగ్గించాలని బ్యాంకర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించడంతో డ్వాక్రా రుణాల మాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని టీడీపీ ఇచ్చిన హామీలు ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డాయి. ఆ హామీని నెరవేర్చటం ఎలా అని ఇప్పుడు ఆ పార్టీ తలలుపట్టుకుంటోంది. రుణ మాఫీ భారం తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. దానిలో భాగంగా లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే ఎలా ఉంటుంది? ఇంటికి ఒక్క డ్వాక్రా రుణం మాత్రమే రద్దు చేస్తే ఎంతవుతుంది? వ్యవసాయదారుల బంగారం రుణాలు రద్దు చేయకుండా డ్వాక్రా రుణాలు, లక్షలోపు వ్యవసాయ రుణాలు మాత్రమే అయితే భారమెంత? అనే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లుకు సూచించారు. ఇలాంటి కొర్రీలతో తమకు అన్యాయం జరుగుతుందోమోనని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నాం
టైలరింగ్ వర్క్ కోసం రూ.50 వేలు డ్వాక్రా రుణం తీసుకున్నాను. గ్రూపు సభ్యులం పదిమందికి మ్తొత్తం రూ.5 లక్షలు అప్పు ఇచ్చారు. ఇంటి వద్ద ఉండి టైలరింగ్ చేసుకుంటాను. ఇప్పటి వరకు రూ.10వేలు చెల్లించాను. రుణమాఫీ చేస్తే నెలవారీగా బ్యాంకునకు కట్టే సొమ్మును పిల్లల భవిష్యత్‌కు వినియోగించుకుంటాను.
-యర్రగుంట కుమారి, నరసాపురం
రుణ మాఫీ చేస్తే కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుంది
మా గ్రూఫు రూ.2 లక్షలు రుణం తీసుకుంది. ఒక్కొక్కరికి రూ.20 వేలు వచ్చింది. ఇప్పటివరకు రూ 2 వేలు కట్టాను. లేసుకుట్టు కోసం రుణం తీసుకున్నా. రుణ మాఫీ చేస్తే ఆ సొమ్ము కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నా.
- యిర్రింకి సూర్యావతి, నరసాపురం
హామీ నెరవేరేనా!
Published Thu, Jun 5 2014 1:13 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement