గన్నవరం: ‘‘రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. బ్యాంకుల్లో కొదువ పెట్టిన మీ బంగారం విడిపించుకోవాలంటే టీడీపీకే ఓటు వేయాల న్నారు. మీ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించాం. ఇది జరిగి ఇప్పటికి మూడున్నరేళ్లైంది. బ్యాంకులో లక్ష రూపాయలున్న అప్పు వడ్డీతో కలిపి ఇపుడు రెండు లక్షల రూపాయలైంది. మీరేమో మాట మార్చి రుణ మాఫీని కుదించారు. మీరిచ్చే అరకొర సొమ్ము వడ్డీలో నాలుగో వంతు కూడా లేదు. దాన్నీ సక్రమంగా ఇవ్వడం లేదు. ఆ పత్రం లేదని, ఈ పత్రం తేండని తిప్పుకుంటున్నారు. కొందరికైతే బాండ్లే రాలేదు. ఎక్కడెక్కడి నుంచో కష్టనష్టాలకోర్చి చార్జీలు పెట్టుకుని సమస్య పరిష్కారమవుతుందని ఇంత దూరం వచ్చాం. పట్టించుకునే నాథుడు లేడు. రైతులంటే పురుగులను చూసినట్లు చూస్తున్నారు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు’’ అంటూ రైతులు మండిపడ్డారు. వివిధ కారణాల వల్ల వివిధ జిల్లాల్లో రుణమాఫీ మూడో విడత సొమ్ము పడని, బాండ్లు రాని వందలాది మంది రైతులు శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని రైతు సాధికార సంస్థ కార్యాలయం వద్దకు వచ్చారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ అధికారులెవరూ రైతుల గురించి పట్టించుకోలేదు. సమాచారం ఇవ్వడానికి కూడా విసుక్కుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. రుణ మాఫీ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
నిబంధనల పేరుతో వేధింపులు
ప్రభుత్వం తక్షణం తమ రుణాలను మాఫీ చేయాలని, నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని రైతులు నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు తక్షణం స్పందించేలా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ‘జిల్లా అధికారులను కలిస్తే.. మీ బాండు రాలేదని చెబుతున్నారు. గన్నవరం వెళ్లండని విసుక్కుంటున్నారు. ఇక్కడికొస్తే పట్టించుకునే వారు లేరు. గట్టిగా మాట్లాడితే వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లండని చెబుతున్నారు. అర్హత ఉండీ ఎంతో మందికి బాండ్లు రాలేదు. ఎందుకు రాలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేద’ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు వెంకన్న వాపోయారు. ‘మొత్తం రుణం మాఫీ అన్నారు. తీరా అందులో పాతిక శాతం కూడా మాఫీ చేయడం లేదు. పైగా కొర్రీలు వేస్తూ వేధిస్తున్నారు. రైతులంటే లెక్కలేదా? ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కక్షకట్టి వేధిస్తున్నారు. రైతులను మోసం చేస్తే బాగుపడరు’ అంటూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు మద్దిలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీ ఎందుకు కాలేదో తెలుసుకునేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికొచ్చాం. కనీసం మేం చెప్పేది కూడా వినరా? ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద ఈ విషయం ఎత్తితే వారికి ఎక్కడ లేని కోపమొస్తోంది. ఆ మాట మాట్లాడటమే తప్పన్నట్లు గుడ్లురుముతున్నార’ంటూ నెల్లూరు జిల్లాకు చెందిన నాయుడు అనే రైతు నిప్పులు చెరిగారు.
జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
‘జిల్లాలో అధికారులు గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వెళ్లండని చెబితే ఇక్కడకు వచ్చాం. వచ్చినోళ్లకు వస్తాయి.. రానోళ్ల సంగతి వదిలేయండని ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఓ ఆఫీసరు చెబుతున్నారు. అధికారులు ఏమీ చేయలేరట. వారి చేతుల్లో ఏమీ లేదట. ఏదైనా చేస్తే గీస్తే ప్రభుత్వమే చేయాలంటున్నారు. వారు చెప్పేదీ నిజమే. మాట ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇపుడు మాట మార్చి రైతుల కడుపు కొట్టడం దారుణం’ అని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు రైతులు మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దనే టీడీపీ మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. ఫలితంగా అప్పుడు తీసుకున్న అప్పు ఇపుడో వడ్డీతో కలిపి రెండింతలైంది. ఆ డబ్బులు చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చూస్తే.. రైతులకు ఏదో ఒరగబెట్టినట్లు గొప్పలు చెబుతూ విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్నార’ని గుంటూరు జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మరోవైపు రైతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రావణ్‌కుమార్, సీఐ సురేష్‌బాబు, గన్నవరం సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకుని రైతులను బలవంతంగా రోడ్డు పక్కకు లాగేశారు. అనంతరం రైతు సాధికార సంస్థ అధికారులతో మాట్లాడి రైతులతో సంప్రదింపులు జరిపారు. సర్వర్ నిలిచిపోవడం కారణంగా సమస్య ఎదురైందని వివరించారు. రైతులందరూ తమ అర్జీలను అందజేస్తే సమస్యలను పరిష్కరించి ఫోన్లలో సమాచారం చెబుతామని ఓఎస్‌డీ శర్మ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఏం చెప్పారు.. ఏం చేశారు?
Published Sat, Nov 4 2017 2:41 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment