కౌలు దారుణాలు
కాలువలు, గెడ్డలకు ఎల్‌ఈసీలు
ఎమ్మెల్యే అనుచరులకు బ్యాంకుల్లో అప్పులు
బినామీ కౌలురైతులుగా టీడీపీ కార్యకర్తలు
విశాఖపట్నం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు రుణాలిచ్చేందుకు కొర్రీల మీద కొర్రీలు వేసే బ్యాంకర్లు అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో రుణాలను జారీ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. రికార్డుల్లో లేనిభూమిని ఉన్నట్టుగా చూపడం, పంటకాలువలు, గెడ్డలను సాగు చేస్తున్నట్లుగా కౌలు అర్హత కార్డులు(ఎల్‌ఈసీ) జారీ చేయడంతో వీటిపై రూ.లక్షల్లో రుణాల మంజూరు చేశారు. ఇలా రుణాలు పొందిన వారిలో ఎమ్మెల్యే అనిత ప్రధాన అనుచరులతో పాటు జన్మభూమి కమిటీ సభ్యులు ఉండడం గమనార్హం. పాయకరావుపేటలోని గ్రామీణ వికాస్‌బ్యాంకు ఈ అవినీతి బాగోతానికి కేంద్రబిందువైంది. ఇదేరీతిలో ఇతర సహకార, వాణిజ్య బ్యాంకుల్లోనూ రూ.లక్షల్లో రుణాలు పొందినట్టు తెలిసింది.
అవినీతి లీలలకు ఇవిగో ఆధారాలు
-అరట్లకోటకు చెందిన అణుకుల జోగిరత్నానికి సర్వేనంబరు 60/4లో 0.24 సెంట్ల భూమికి పాస్‌పుస్తకం ఉండగా, ఇదే సర్వే నంబరులో 0.88 సెంట్లు భూమి యాళ్ల రామారావుకు ఉన్నట్టుగా చూపిస్తూ పాయకరావుపేటకు చెందిన వేములపూడి అప్పారావు (జన్మ భూమి కమిటీ సభ్యుడు)కు ఎల్‌ఈసీ కార్డు (037359)ఇచ్చారు. సర్వేనంబరు 41/6లో 0.13 సెంట్లు భూమిలో గెడ్డ, వాగుగా నమోదై ఉంటే దీనిని కూడా అప్పారావుకు ఇచ్చిన గుర్తింపు కార్డులో చూపించారు. ఈ రెండు సర్వేనంబర్లలో కేవలం 0.37 సెంట్లు ఉంటే అప్పారావుకు జారీ చేసిన ఎల్‌ఈసీ కార్డులో మాత్రం ఏకంగా 1.47ఎకరాలున్నట్లు చూపించారు. ఈ కార్డు ఆధారంగా అప్పారావుకు వికాస గ్రామీణ బ్యాంకులో రూ.40వేలు రుణం పొందాడు.
తునిమండలం సూరవరానికి చెందిన తూము వెంకటరమణకు అరట్లకోటలో సర్వే నంబరు 39 లో 2ఎకరాలుంది.ఆయన మరణించడంతో అతని భార్య సాగు చేస్తోంది. ఆమె ఈ భూమిని ఎవరికి కౌలుకు ఇవ్వలేదు. కానీ 2 ఎకరాల భూమిని పాయకరావుపేటకు చెందిన కాకడ జయకు ఎల్‌ఈసీ(037371) జారీ చేయగా, దీనిపై వీజీబీలో రూ.40వేలు రుణం తీసుకున్నాడు. సర్వేనంబరు 18/2ఏ-లో 2 ఎకరాలుంటే నలుగురిపేరిట 4.50 ఎకరాలున్నట్టుగా ఎల్‌ఈసీలు జారీచేశారు. అలాగే మరో సర్వేనంబరు 156/6లో 0.36 సెంట్లలో పంటకాలువ ఉంది. దీనిని 2.10 ఎకరాలుగా చూపిస్తూ సత్యనారాయణ అనే వ్యక్తికి ఎల్‌ఈసీ జారీ చేశారు. సర్వేనంబరు 42/1ఏ,1బి లో 0.57సెంట్లు ఉంటే టీడీపీ ఎంపీ టీసీ సభ్యుడు బి.కాశీవిశ్వనాథ్‌కు 1.22ఎకరాలకు ఎల్‌ఈసీ కార్డుఇచ్చారు. వీరంతా ఈ కార్డుల ఆధారంగా రుణాలు పొందేందుకు పైరవీలు చేస్తున్నారు.