మంత్రి మాట దా‘రుణం’ | Auction ads in the press | Sakshi
Sakshi News home page

మంత్రి మాట దా‘రుణం’

Published Wed, Mar 9 2016 11:30 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

మంత్రి మాట దా‘రుణం’ - Sakshi

మంత్రి మాట దా‘రుణం’

పత్రికల్లో వేలం ప్రకటనలు  
అన్నదాతలకు బ్యాంకుల నుంచి తాఖీదులు
వడ్డీతో తడిసి మోపెడైన బంగారు రుణాలు
విడిపించుకునే దారిలేక అన్నదాతల గగ్గోలు

 
‘బ్యాంకుల్లో తనఖా పెట్టిన పుస్తెలతాడు రావాలంటే బాబు రావాలి.. మేం అధికారంలోకి రాగానే మీ రుణాలన్నీ అణా పైసలతో సహా మాఫీ చేస్తాం.. మీరు కుదవపెట్టిన  బంగారు వస్తువులన్నీ పువ్వుల్లో పెట్టి మీచేతుల్లో పెడతాం’..   అన్నదాతలను బుట్టలో వేసుకునేందుకు టీడీపీ ఎన్నికల్లో ఊదరగొట్టిన హామీల్లో ఇదొకటి... ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా అధికారంలోకి వచ్చాక తూచ్ మేము బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదు. లక్షన్నరలోపు  పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తాం.. అని చివరకు అరకొరగా సర్దుబాటు చేసి అన్నదాతల నెత్తిన శఠగోపం పెట్టింది ఈ ప్రభుత్వం. కుదవ పెట్టిన బంగారం వేలం వేసేందుకు బ్యాంకర్ల నుంచి నోటీసులొస్తుంటే.. ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఏ బ్యాంకులోనూ రైతుల బంగారం వేలం వేయలేదంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడంపై  మండిపడుతున్నారు.
 
విశాఖపట్నం: అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలు గుప్పించారు. అందులో ప్రధానమైనది ‘అన్ని రకాల పంట రుణాలు పూర్తిగా మాఫీ..’ హామీ. దీన్ని నమ్మిన రైతులు ఎంతో ఆశతో ఆ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు. ఆ తరువాత  చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది. రుణం మాఫీ కాక రైతులంతా మోసపోయారు.  స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం ఇచ్చే రుణం సరిపోక,   పంటలను కాపాడుకునేందుకు  ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించలేక ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కుదవపెట్టి రుణాలు తీసుకునే అన్నదాతలే ఎక్కువ శాతం ఉంటారు.. ఏటా మంజూరుచేసే స్వల్పకాలిక వ్యవసాయ రుణాల్లో 45 నుంచి 50 శాతం వరకు క్రాప్‌లోన్లు, 50 నుంచి 55 శాతం వరకు అగ్రికల్చర్ గోల్డ్ లోన్లు ఉంటాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్‌డీడ్స్, ఇతర డాక్యుమెంట్లు  మాత్రమే కుదవపెట్టుకుని పొలం విస్తీర్ణాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మంజూరు చేసేవి క్రాప్‌లోన్లు. పొలం డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలను కుదవపెట్టి తీసుకునేవి అగ్రికల్చర్ గోల్డ్ లోన్లు. జిల్లాలో 2.76 లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూములుంటే.. వాటిపై 4.74 లక్షల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో 3.87 లక్షల మందికి పంట, గోల్డ్ రుణాలున్నాయి.

స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కింద 2010-13 మధ్య 1718 కోట్ల రుణాలు ఇస్తే దాంట్లో సుమారు 900 కోట్ల వరకు అగ్రి కల్చర్ గోల్డ్ లోన్లు ఉంటాయని అంచనా. సాధారణంగా నూటికి 80 శాతం మంది అప్పోసప్పో చేసుకుని ఏడాది లోపు విడిపించుకోవడమో లేకపోతే వడ్డీ చెల్లించి తిరగరాయించుకోవడమో చేస్తుంటారు. బాబు ఇచ్చిన హామీ వల్ల సుమారు రెండున్నర లక్షల మంది రైతులు తమకున్న బంగారు రుణాలపై వడ్డీలు చెల్లించడం మానేశారు. బ్యాంకర్ల లెక్కల ప్రకారం పేరుకుపోయిన బంగారు రుణాలు రూ.300 కోట్ల వరకు ఉన్నాయి. అంటే సుమారు టన్ను బంగారం ఈ విధంగా బ్యాంకు లాకర్లలో మూలుగుతున్నట్టే. దీనికి తోడు బంగారం ధరలు తగ్గడంతో ప్రస్తుతం గ్రాముకు రూ.1500  మించి రుణం ఇవ్వడం లేదు. గతంలో తనఖా పెట్టినప్పుడు రూ.2వేల వరకు ఇచ్చేవారు. దీంతో ఇప్పుడు 14 శాతం వడ్డీతో సహా ధరలో ఏర్పడిన వ్యత్యాసం మొత్తం కలిపి చెల్లిస్తేనే తిరగరాస్తామంటూ  బ్యాంకర్లు తెగేసి చెప్పడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. నాన్ ఫెర్‌ఫార్మెన్స్ ఎసెట్స్ (ఎన్‌పీఎ) గా మారిన ఈ బకాయిల వసూలుకోసం బ్యాంకర్లు వేలం నోటీసులిస్తున్నారు. గతేడాది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో మార్చి-ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున పత్రికల్లో వేలం ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలు రాగానే వేలాది మంది అప్పోసప్పో చేసి వడ్డీలు చె ల్లించి తిరగరాయించుకున్నారు. మరో పక్క బ్యాంకర్ల లెక్కల ప్రకారం సుమారు 65 వేల మందికి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులందుకున్న వారిలో మూడోవంతు వడ్డీలు చెల్లించి రీ షెడ్యూల్ చేయించుకున్నారు.  ప్రస్తుతం ఈ ఏడాది కూడా మార్చి నెలాఖరులో కూడా ఇదే రీతిలో పత్రికల్లో వేలం ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్క రావికమతం, నర్సీపట్నం, మాడుగుల, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో వందలాది మంది రైతులకు జారీ చేసేందుకు నోటీసులు  సిద్ధం చేసినట్టు తెలిసింది.

అప్పు చేసి బంగారం విడిపించా
వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం 2013 డిసెంబర్‌లో చోడవరం స్టేట్ బ్యాంక్‌లో 8 తులాల బంగారు అభరణాలపై 1.10 లక్షలు రుణం తీసుకున్నా. వడ్డీతో కలిపి 1.28 లక్షలు  అయింది. పంటలు అంతంత మాత్రంగానే పండటంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న సమయంలో రుణ మాఫీ చేస్తామని  చంద్రబాబు చెప్పడంతో చెల్లించడం మానేశాం. అయితే మాఫీ లేదని తక్షణమే రుణం చెల్లించకపోతే వేలం వేస్తామని బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో  పొలం తాకట్టు పెట్టడంతో పాటు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి రుణం చెల్లించి ఆభరణాలు విడిపించుకున్నాం.    గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి అన్ని రకాల రైతు రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడంతో పాటు మాఫీ కాని వారికి 5 వేలు ప్రోత్సాహకం అందజేసి రైతు పక్షపాతిగా నిలిచారు. చంద్రబాబు   రైతు ద్రోహిగా  ముద్ర వేసుకున్నారు. - బూరె బాబురావు, రైతు, సర్పంచ్, బోయిల కింతాడ గ్రామం, దేవరాపల్లి మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement