బోగస్ గుట్టురట్టు
బోగస్ గుట్టురట్టు
Published Fri, Oct 28 2016 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
- బోగస్ పట్టాదారుపాసు పుస్తకాలతో
రుణం పొందేందుకు యత్నం
- టీడీపీ నేత తనయుడి హస్తం
కోడుమూరు(గోనెగండ్ల): బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా కర్నూలు ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకునేందుకు చేసిన ప్రయత్నం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గంజిహల్లి గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఆధార్ కార్డు, పాన్‌కార్డులను తన ఫోటో ఆధారంగా సృష్టించుకున్నాడు. «వెబ్‌ల్యాండ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదున్న 27ఎకరాల భూమికి ఆధారంగా ధనుంజయ పట్టాదారు పాసుపుస్తకాలు, తన ఫోటోలతో తయారు చేయించుకున్నాడు. బోగస్ పాసు పుస్తకాలతో కర్నూలులో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకునేందుకు మధ్యవర్తులను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.70వేల చొప్పున రూ.19లక్షలకు మార్ట్‌గేజ్ రుణం పొందేందుకు బ్యాంకు మేనేజర్‌తో ఒప్పందం చేసుకున్నారు. మార్ట్‌గేజ్ రుణం కోసం బ్యాంకు అధికారులకు బోగస్ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, పాన్ కార్డులను అందజేశారు. వీటి ఆధారంగా బ్యాంకు క్షేత్రస్థాయి పరిశీలన వచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది లోబర్చుకొని నిజమేనన్నట్లుగా ధృవీకరణ పత్రం ఇప్పించారు. ఇంతటితో బ్యాంకు అధికారులు సంతృప్తి చెందక, దేవనకొండ మండలం తెర్నేకల్లు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో విచారణ చేశారు. అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీద పంట రుణం ఉంది. రాయలసీమ గ్రామీణ బ్యాంకులోని పాసుపుస్తకంపై ఉన్న ఫోటోకు ధనుంజయ ఫోటోకు తేడా రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వ్యవహారమంతా గుట్టు రట్టయింది. ధనుంజయ అనే వ్యక్తి బోగస్ వ్యవహారంపై బాధిత రైతులు రెడ్డిగారి కృష్ణారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుంజయపై ఫోర్జరీ, 420కేసు నమోదైంది. గోనెగండ్ల టీడీపీ నేత కుమారుడు అండదండలతో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల టీడీపీ నేత కుమారుడు గోనెగండ్లలోని 7సెంట్ల ఇతరుల స్థలాన్ని అక్రమంగా విక్రయించినట్లు తెలిసింది. పరారీలో ఉన్న ధనుంజయ బయటకు వస్తే టీడీపీ నేత కుమారుడి అక్రమాలన్ని బయటకొచ్చే అవకాశాలున్నాయి. ఈ కారణంగా ధనుంజయను కర్ణాటకలో ఒక రహస్య ప్రాంతంలో ఉంచినట్లు తెలిసింది.
అమాయకుడిపై పోలీసుల జులుం
గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామానికి చెందిన బసన్న అనే వ్యక్తిని గోనెగండ్ల ఎస్‌ఐ క్రిష్ణమూర్తి చితకబాదాడు. లాఠీదెబ్బలతో తీవ్ర గాయాలకు గురైన బసన్న ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్రగాయాలకు గురైన బసన్న బోగస్ పాసుపుస్తకాల కేసులో ముద్దాయిగా ఉన్న ధనుంజయకు బావమరిది. పాసుపుస్తకాల వ్యవహారంలో ధనుంజయపై కేసు లేకుండా ఉండేందుకు పోలీస్‌స్టేషన్‌కు మధ్యవర్తిగా వెళ్లి రూ.5వేలు మట్టజెప్పేందుకు ప్రయత్నించాడు. సంతృప్తి చెందని పోలీసులు బసన్నను లాఠీలతో కుళ్లబొడిచారు. వాస్తవంగా ఈ కేసుకు బసన్నకు ఎలాంటి సంబంధం లేదు. గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో ముందస్తుగా పోలీసులు బసన్నపై అక్రమ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు అక్రమాలకు పాల్పడిన ధనుంజయపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
బసన్నను కొట్టలేదు : క్రిష్ణమూర్తి, ఎస్‌ఐ, గోనెగండ్ల
బోగస్ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసిన ధనుంజయతో పాటు బసన్నపై 420, ఫోర్జరీ కేసు నమోదు చేశాం. మూడు రోజుల క్రితం బసన్నను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, తిరగబడ్డాడు. ఈ క్రమంలో మినిమమ్ ఫోర్సు ఉపయోగించాం. బసన్నను కొట్టలేదు.
Advertisement
Advertisement