సాక్షి,చైన్నె: కట్టుకున్న భార్య ఇష్టానుసారంగా చేసిన అప్పుల కారణంగా ఓ భర్త కుంగి పోయాడు. తీసుకున్న అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో వెలుగు చూసింది. వివరాలు.. కోయంబత్తూరు నగరం పరిధిలోని వడ వెళ్లి వేంబు అవెన్యూలోని ఆ బహుళ అంతస్తుల భవనంలోకి కొంతకాలం క్రితం రాజేష్ (34) కుటుంబం అద్దెకు చేరింది. రాజేష్ ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. అతడి భార్య లక్ష్య(29) ఫ్రెంచ్ కోర్సులో పట్ట భద్రురాలు.
వీరికి యక్షిత(10) అనే కుమార్తె ఉంది. వీరితో పాటు రాజేష్ తల్లి ప్రేమ (70) ఆ ఇంట్లో ఉన్నారు. వీరి ప్లాట్ తలుపులు గత రెండు రోజులుగా తెరచుకోలేదు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపు పగల కొట్టి చూడగా, ఓ గదిలో రాజేష్ ఉరివేసుకుని మరణించి ఉండటం వెలుగు చూసింది. మరో గదిలో లక్ష్య, యక్షిత, ఇంకో గదిలో ప్రేమ విషం తాగి మరణించి ఉండడం వెలుగు చూసింది. ఆ ఇంట్లో లభించిన లేఖతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
నాలుగో తరగతి విద్యార్థిని అయిన తన కుమార్తె చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒకరితో తన భార్యకు పరిచయం ఏర్పడిందని రాజేష్ ఆలేఖలో వివరించాడు. అతడి వద్ద కొంత మొత్తాన్ని తన భార్య అప్పుగా తీసుకుని ఉందని, అతడికి కావాల్సి వ్యక్తులు వద్ద కూడా అప్పులు చేసి ఆ సొమ్మును ఏం చేసిందో తనకు తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ అప్పు మొత్తం 31 లక్షలకు చేరిందని వివరించాడు. ఈ సొమ్ము చెల్లించాలని సంబంధిత ఉపాధ్యాయుడు, అతడికి చెందిన వారు ఒత్తిడి తెస్తూవచ్చారని, ఈ అప్ప చెల్లించలేని పరిస్థితుల్లో తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ లేఖలో రాజేష్ పేర్కొన్నాడు.
దీంతో వీరికి అప్పు ఇచ్చిన వారి వద్ద పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరికి స్నేహితులు,బంధవులు ఎవురైనా ఉన్నారా..? అని విచారిస్తున్నారు. రాజేష్ కుటుంబానికి సన్నిహితంగా ఎవరూ లేదని తేలడంతో ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతంరం మార్చురీలోనే ఉంచారు. సోమవారం లేదా మంగళవారం వారి అంత్యక్రియల విషయంపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment