కాపులకు మొండిచెయ్యి! | only 25,000 subsidy loans to kapu community in AP | Sakshi
Sakshi News home page

కాపులకు మొండిచెయ్యి!

Published Thu, Feb 25 2016 9:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

only 25,000 subsidy loans to kapu community in AP

3 లక్షలకు పైగా రుణ దరఖాస్తుల్లో కేవలం 25 వేలమందే అర్హులుగా ఎంపిక
రుణాల పంపిణీలో బాబు సర్కారు మతలబు
దరఖాస్తులు ముద్రగడ దీక్షకు ముందు, ఆ తర్వాత వచ్చినవిగా విభజన
దీక్షకు ముందు వచ్చిన దరఖాస్తులే పరిశీలన
వడపోతలు.. జన్మభూమి కమిటీలతో ఎంపిక
10 శాతం మందికి కూడా దక్కని రుణాలు
ఈ నెల 3 తర్వాత వచ్చినవి పెండింగ్‌లో
నేడు ఏలూరులో కాపు రుణాల మేళా

 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఊహించినట్టే జరుగుతోంది. రుణాల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు మొండిచెయ్యే చూపుతోంది. దరఖాస్తు చేసుకున్న కాపులందరికీ రుణాలందేలా చూస్తామని కాపు నేత ముద్రగడ పద్మనాభంతో దీక్ష విరమింపజేసిన సందర్భంగా హామీ ఇచ్చి.. అర్హుల సంఖ్యను గణనీయంగా కుదించేందుకు అనేకరకాల వడపోతలు చేపట్టింది. ఈ నెల 22వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందితే.. అందులో కేవలం 25 వేలమందినే తొలివిడత అర్హులుగా ప్రకటించింది. అంటే మొత్తం దరఖాస్తుల్లో కనీసం 10 శాతం మందిని కూడా ప్రభుత్వం అర్హులుగా ఎంపిక చేయలేదన్నమాట. ముద్రగడ దీక్షతో ముడిపెట్టి దరఖాస్తులను విభజించిన బాబు ప్రభుత్వం.. గురువారం ఏలూరులో ఎంపికచేసిన కొద్దిమందికి యూనిట్లు పంపిణీ చేయనుంది.

కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా చంద్రన్న స్వయం ఉపాధి కింద కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల ఆర్థిక స్వావలంబన కోసం రుణాలిచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,20,821 దరఖాస్తులు రాగా ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 61,505 దరఖాస్తులు వచ్చాయి. అయితే రుణాల మంజూరుకు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షతో ముడిపెట్టింది. ముద్రగడ దీక్షకు ముందు దరఖాస్తు  చేసుకున్నవారు, దీక్ష విరమణ అనంతరం దరఖాస్తు చేసుకున్నవారు అంటూ రెండు రకాలుగా విభజించింది.

పైగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ఆమరణ దీక్ష చేపట్టక ముందు ఫిబ్రవరి 3వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలని బాబు సర్కారు నిర్ణయించింది. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులనే పరిశీలన కోసం బ్యాంకులకు, ఎంపీడీవోలకు, జన్మభూమి కమిటీలకు పంపారు. ఆ దరఖాస్తుల్లోనూ అర్హులైన వారి పేరిట జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన కొద్దిశాతం మందికి మాత్రమే రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. జిల్లా అధికారులు మండల కేంద్రాలకు పంపించిన వేల దరఖాస్తుల్లో కేవలం పదులు, వందల సంఖ్యలో దరఖాస్తులనే ఆయా బ్యాంకులు, జన్మభూమి కమిటీలు ఆమోదించాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో 61 వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈ నెల 3వ తేదీ నాటికి వచ్చిన 10 వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలన కోసం బ్యాంకులకు, ఎంపీడీవోలకు, జన్మభూమి కమిటీలకు జిల్లా అధికారులు పంపారు. ఆ 10వేల దరఖాస్తుల్లో సగానికి కోత విధించి 5వేల దరఖాస్తులను మాత్రమే ఆయా బ్యాంకులు, జన్మభూమి కమిటీలు ఆమోదించాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 వేలమందిని మాత్రమే తొలివిడత అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం వారికి యూనిట్లు పంపిణీ చేయనుంది. ఇక ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత దరఖాస్తు చేసిన వారికి రుణాలు ఎప్పుడిస్తారన్నది అధికారుల వద్ద సరైన సమాధానం లేదు.

దీక్షకు ముందు వచ్చిన దరఖాస్తులే పరిశీలన: మంత్రి రవీంద్ర
ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టక ముందు ఫిబ్రవరి మూడో తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి అర్హులను ఎంపిక చేసిన మాట వాస్తవమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఏలూరులో మీడియాకు తెలిపారు. ‘3వ తేదీని తొలి విడత కటాఫ్ తేదీగా నిర్ణయించాం కాబట్టి అలా చేశాం. ఆ తర్వాత దరఖాస్తు చేసిన వారికి రెండో విడతలో రుణాలు మంజూరు చేస్తాం. రెండో విడత రుణాలు ఎప్పటి నుంచి ఇస్తామనేది ఇంకా ఖరారు కాలేదు’ అని రవీంద్ర చెప్పారు.
 
ఆ విషయం నాకు తెలియదు: ముద్రగడ
‘నేను 5వ తేదీ నుంచి నిరశన దీక్ష మొదలుపెట్టాను. ఆ దీక్షకు ముందు దరఖాస్తు చేసిన వాళ్లనే అర్హులైన వారిగా గుర్తిస్తున్నారా.. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిశీలనలోకి రావడం లేదా.. నిజమేనా..’ అని ముద్రగడ పద్మనాభం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పటివరకు తన దృష్టికి రాలేదని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇలా ఉందా.. రాష్ట్రమంతటా అదే పరిస్థితి ఉందా అని తాను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ముద్రగడ బుధవారం ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement