సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా వానకు తడిసిన ధాన్యంతో బాయిల్డ్ రైస్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యవసరంగా బాయిల్డ్ రైస్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని, ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచుతామని స్పష్టం చేశారు.
సోమవారం మంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన నల్లగొండ జిల్లాలో 22 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్‌లో 14,700, కరీంనగర్‌లో 7,350, యాదాద్రి, జగిత్యాలలో 5,000 మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ రైస్ కోసం ధాన్యం సేకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గంగుల వెల్లడించారు. ఇప్పటివరకు గత యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వివరించారు.
గతేడాది ఇదే రోజునాటికి 3.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా.. ఈ సారి 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి, రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ రూ.1,543 కోట్లని తెలిపారు. నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment