సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ప్రకోపానికి గురైన అన్నదాతకు ఈసారి భారీ నష్టం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో గతంలో కూడా అకాల వర్షాలు పడ్డాయని, అలాంటప్పుడు 20 శాతం మేర నష్టం జరిగేదని.. కానీ వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు కొన్నిచోట్ల వందకు వంద శాతం పంట దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
వేగంగా సేకరణ ప్రక్రియ
‘పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇక ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా, వేగవంతంగా సేకరించే ప్రక్రియ జరుగుతుంది..’అని గంగుల తెలిపారు.
తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ కోసం..
‘తడిసిన ధాన్యంలో తేమ శాతం 20 వరకు వస్తే దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించాం. నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో తడిసిన ధాన్యాన్ని బాయిలŠడ్ రైస్‌గా మార్చడానికి ఆదేశాలు జారీ చేసి, ఆయా మిల్లులకు కేటాయింపులు జరిపాం.
ఇప్పటివరకు మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చాం. పరిస్థితికి అనుగుణంగా పరిమాణం పెంచుతాం. రాష్ట్రంలో ఎక్కడ తడిసిన ధాన్యం ఉన్నా బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం..’అని చెప్పారు.
కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత
కరీంనగర్ మండలం దుర్శేడ్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ తోపులాట చోటుచేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మంత్రి గంగుల మంగళవారం దుర్శేడ్ కొనుగోలు కేంద్రానికి వచ్చారు.
అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్‌రావు, పద్మాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రిని కలిశారు. కేంద్రాల్లో టార్పాలిన్లు లేవని, ఒక్కో పరదాకు రైతులు రోజుకు రూ.30 కిరాయి చెల్లిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి, కాంగ్రెస్ నేతలకు మధ్య స్వల్ప వాగి్వవాదం జరిగింది. ఇరుపక్షాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment