సాక్షి, హైదరాబాద్: వదలకుండా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. వ్యవసాయ శాఖ మాత్రం 2.28 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమింకగా అంచనా వేసి, చివరకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి సంబంధించి రైతులకు పరిహారం ప్రకటించింది. ఇలావుండగా మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగండ్లతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వరి, మొక్కజొన్న.»ొబ్బర్లు, మినప పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు 95 శాతం వరకు రాలిపోయాయి. కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లింది. టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. తాజా వర్షాలతో కోతకు వచ్చిన వరి గింజలోకి నీరు చేరి రంగుమారే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏటా ఇదే పరిస్థితి...
ఏటా ఎండాకాలంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. గతేడాది యాసంగి సీజన్‌లో కురిసిన వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లకు దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. దానినుంచి బయటికొచ్చిన తర్వాత పంట నష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. గత నెలలో దెబ్బతిన్న పంటలకు మాత్రం ఎకరానికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయ శాఖ చెబుతున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. కనీసం కసరత్తు కూడా చేయడం లేదు. దీనివల్ల పంట వేసిన తర్వాత అది చేతికొచ్చే వరకు అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. రైతుబంధుతో ఊరట పొందుతున్న రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే మాత్రం పరిహారం అందడంలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
పంటల బీమా వల్ల గతంలో రైతులు ఎంతోకొంత లాభపడ్డారని వ్యవసాయ శాఖ వర్గాలు సైతం అంగీకరిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటలకు బీమా చేయించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు, ఆ కంపెనీలను బాగు చేసేవిగా ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్ర భుత్వం వాటినుంచి బయటకు వచ్చింది. కానీ మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment