ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
రూ.11,537.40 కోట్ల రుణభారం తగ్గించుకున్నాం
మంత్రి తుమ్మలతో కలిసి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వీడియోకాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు.
దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment