సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
మార్కెట్‌లోనూ మంచి ధర
ఖరీఫ్‌లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
కాగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు
రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది.
మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్‌తో కోతలు ఆలస్యం అవుతున్నాయి.
దళారులతో పని లేకుండా..
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి.
ఎఫ్‌టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్‌కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్‌ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్‌గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్‌సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కొనుగోళ్లకు సిద్ధం
గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్‌లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ
ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్‌లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ
మద్దతు ధరల చెల్లింపు ఇలా..
ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్‌కు)
రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు)
సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్‌కు)
Comments
Please login to add a commentAdd a comment