బియ్యం మిఠాయిలు | sankranti food special | Sakshi
Sakshi News home page

బియ్యం మిఠాయిలు

Published Fri, Jan 13 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

బియ్యం మిఠాయిలు

బియ్యం మిఠాయిలు

కొత్త ధాన్యం ఇంటికి వచ్చింది... కొత్త సంతోషాల పంట పండుగ చేసింది.
ఉగాదికైతే ఆరు రుచులు కావాలి కానీ, సంక్రాంతి మాత్రం తియ్యగానే ఉండాలి.
ఆరుబయటి నుంచి ఇంట్లో దాకా... అంతా తియ్యతియ్యగానే ఉండాలి.
అందుకే... ఈ బియ్యం మిఠాయిలతో తియ్యటి పండుగ జరుపుకోండి.


పరమాన్నం
కావల్సినవి: కొత్త బియ్యం – ముప్పావు కప్పు, బెల్లం – 250 గ్రాములు, యాలకులు – 4 (పొడి చేయాలి), పాలు – 5 కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, జీడిపప్పు , కిస్‌మిస్‌ – తగినన్ని, నెయ్యి – 3 టేబుల్‌స్పూన్లు

తయారీ: ∙బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోసి సన్నని మంట మీద కరిగించాలి. దీన్ని వడకట్టి, చెత్త తీసేయాలి. ఈ బెల్లం పానకాన్ని చల్లారనివ్వాలి. ∙ పాలు మరిగించి పక్కనుంచాలి. ∙బియ్యంలో నీళ్లు పోసి ఉడకించాలి. ∙చిన్న పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించాలి. ∙బియ్యం మెత్తగా ఉడికాక చల్లారిన బెల్లం పాకాన్ని పోసి కలపాలి. దీంట్లో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి కలిపి, మంట తీసేయాలి.

బూరెలు
కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు

తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్‌ క్లాత్‌లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ బియ్యాన్ని రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పిండి చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో వేసి దాంట్లో పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. దీంతో బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము వేసి కలపాలి. కొంచెం జిగురుగా అయ్యేంతవరకు ఉంచి, నెయ్యి వేసి కలపాలి. తర్వాత దీంట్లో బియ్యప్పిండి వేస్తూ అదేపనిగా కలుపుతూ ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి చల్లారిందా లేదా చూసుకొని నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్‌ కవర్‌ మీద పెట్టి, వెడల్పుగా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించాలి.

తీపి పునుగులు
కావల్సినవి: కొత్తబియ్యప్పిండి – కప్పు, ఓట్స్‌ పొడి – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – కప్పు, యాలకుల పొడి – టీ స్పూన్, పంచదార – కప్పు, మైదా – కప్పు, జీడిపప్పు పలుకులు – టేబుల్‌ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా

తయారీ: ∙ఒక గిన్నెలో నూనె, పాలు మినహా మిగిలిన పదార్థాలన్నీ తీసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పునుగుల పిండిలా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కాగుతున్న నూనెలో ఉండల్లా వేసుకొని ఎర్రగా వేగాక తీయాలి.

తీపి పొంగలి
కావల్సినవి:  కొత్త బియ్యం – కప్పు, పెసరపప్పు – అర కప్పు, బెల్లం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 4 1/2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పులు – 12, కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పక్కనుంచాలి. ∙అదే పాన్‌లో పెసరపప్పు కూడా కొద్దిగా వేయించి పక్కనుంచాలి. ∙వేడి బాణలిలో బెల్లం తురుము వేసి, కరిగేంతవరకు ఉంచి, చల్లారనివ్వాలి. ∙మరొక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, మంట తగ్గించాలి. ∙బియ్యం, పెసరపప్పు కడిగి నీళ్లు వంపి మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోయాలి. బియ్యం–పప్పు మెత్తగా ఉడికించి మంట తగ్గించాలి. దీంట్లో కిగించిన బెల్లం వేసి కలపాలి. మిశ్రమం ఉడికేంతవరకు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి మరో 2–3 నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. ఈ తీపి పొంగలిని వేడిగానూ, చల్లగానూ సర్వ్‌ చేయవచ్చు.
నోట్‌: జీడిపప్పు, కిస్‌మిస్‌లు మంచి టేస్ట్‌ రావాలంటే చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.

బెల్లం గారెలు
కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు

తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం పట్టాలి. ∙బాణలిలో నూనె పోసి, కాగనివ్వాలి. చేతులు తడిలేకుండా చూసుకొని చేతిమీద గానీ, అరటి ఆకు మీదగానీ నిమ్మకాయ పరిమాణంలో పిండి తీసుకొని అదిమి మధ్యకు పెద్ద రంధ్రం చేయాలి. ∙ఇలా చే సిన దాన్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదలాలి. సన్నని మంట మీద రెండువైపులా వేయించాలి. ∙గారె బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాక  తీసి బెల్లం పాకంలో వేయాలి. మరో గారె సిద్ధమైంతవరకు బెల్లం పాకంలో గారెను ఉంచి, తర్వాత తీసి ప్లేట్‌లో పెట్టాలి. వేడి వేడిగా సర్వ్‌ చేస్తే కరకరలాడుతూ బెల్లం గారెలు రుచిగా ఉంటాయి. వీటిని పెసరపప్పు, మినప్పప్పుతోనూ చేసుకోవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement