
పల్లెకు పండగొచ్చింది..!
కోవెలకుంట్ల: ధాన్యం చేతికొచ్చిన సమయంలో ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పండగకు వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా స్వగ్రామానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ముగ్గులు, పిండి వంటకాలు.. ఆటల పోటీలు.. ఇలా ఎన్నో సంక్రాంతి పండగకు సరికొత్త సందడిని తీసుకొస్తున్నాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని భాగ్యనగరం గ్రామంలో ఈ పండగను ప్రతీ ఏటా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అందుకుతగినట్లు ఏర్పాట్లు చేశారు.
గుంటూరు, ఒంగోలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 52 సంవత్సరాల క్రితం వచ్చివారు దొర్నిపాడు మండలంలోని కేసీ కెనాల్ పరివాహ ప్రాంతాలైన భాగ్యనగరం, రామచంద్రాపురుం, అర్జునాపురం, వెంకటేశ్వరనగర్(డాక్టర్ కొట్టాల), రాజనగరం ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. వీరి పిల్లలు, మనవళ్లు, మనుమరాళ్లు ఉన్నత చదువులు చదివి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు ఎక్కడ ఉన్నా.. సంక్రాంతి పండగకు ముందురోజు మాత్రం అందరూ సొంత గ్రామాలను చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
బంధువులంతా ఒకేచోట చేరి వారం రోజుల పాటు శ్రమించి పిండి వంటకాలను తయారు చేస్తారు.భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అరిసెలు, పసుపు, కుంకుమ, కర్పూరంతో బోగిమంటలు వేసి పండుగకు స్వాగతం పలుకుతారు. భోగి సందర్భంగా ప్రతీ ఇంటా దోసె, నాటుకోడి చికెన్ ప్రత్యేక వంటకం. మకర సంక్రాంతికి ఇళ్లుముందు రంగురంగుల ముగ్గులు వేసి అలంకరణ చేస్తారు.
బియ్యంతో పొంగలి తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడంతోపాటు ఆయా గ్రామాల్లో వెలసిన రామాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హరిదాసులకు బియ్యం, అరిసెలు, చెక్కలు, తదితర పిండి వంటకాలను దానం చేస్తారు. కనుమ రోజున చికెన్, వడలు, మటన్, తదితర ఆహార పదార్ధాలను ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. రామచంద్రాపురం గ్రామంలో మకర సంక్రాంతి రోజున బియ్యం పిండి, పాలు, బెల్లంతో కూడిన పాలతాళికలు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు.
వారింట పండగ సందడి
భాగ్యనగరంలో తాళ్లూరు, కరిమాల కుటుంబాల్లో పండగ సందడి బాగా కనిపిస్తుంది. నలుగురు అన్నదమ్ములు, వారి కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమన్లు, మనుమరాళ్లతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది. సుమారు వంద మందితో ఆ కుటుంబాలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.
వారం రోజుల ముందేగానే..
సంక్రాంతి పండుగను ప్రతీ ఏటా వైభవంగా జరుపుకుంటాం. నా భర్త అం కాల్‌నాయుడు, నేను డాక్టర్లుగా ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాం. ఈ ఏడాది పండుగకు వారం రోజుల ముందుగానే భాగ్యనగరం చేరుకున్నాను. పిండి వంట తయారీలో నా వంతు సాయం చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం.
- నాగసుధారాణి, డాక్టర్, భాగ్యనగరం
కబుర్లే.. కబుర్లు...
సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబసభ్యులమంతా గ్రామాన్ని చేరుకుంటాం. పండుగ నిర్వహించే మూడు రోజులు పిండి వంటకాలు, ముచ్చట్లు, కబుర్లతో సరదాగా గడుపుతాం. నా భర్త హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డాం. మాకు నికిల్ చౌదరి, జోషిక సంతానం. భాగ్యనగరంలో మూడు రోజులు సంక్రాంతి వేడుకలను నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చాం. - శశికళ, ఎంసీఏ