పంట పండింది! | Grain Purchase Start In Telangana Market | Sakshi
Sakshi News home page

పంట పండింది!

Published Mon, Oct 14 2019 1:55 AM | Last Updated on Mon, Oct 14 2019 1:55 AM

Grain Purchase Start In Telangana Market - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో విస్తారంగా కురిసిన వర్షాలు, నిండిన చెరువులు, ప్రాజెక్టుల నుంచి నీటి విడు దల నేపథ్యంలో మార్కెట్లలోకి ధాన్యం పోటెత్తనుంది. ప్రస్తుత సీజన్‌లో ఏకంగా 26.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడంతో అందుకు తగ్గట్లే ఈ ఏడాది ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది 15 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా అంటే మొత్తం 55 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా  వేస్తోంది. ఈ నెల 15 నుంచి కొనుగోళ్లు ఆరంభం కానుండటంతో అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ధాన్యం విక్రయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేసింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్‌ఛార్జిగా నియమించింది.

15న మూడు జిల్లాలతో ఆరంభం..
ఖరీఫ్‌లో ధాన్యం పోటెత్తే అవకాశాల నేపథ్యంలో రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలను గతంలోనే ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 2019–20 ఏడాదిలో మొత్తంగా 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఖరీఫ్‌లో 55 లక్షల టన్నులు, రబీలో 37లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ఖరీఫ్‌ కొనుగోళ్ల కోసం 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి దాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. క్వింటాలు గ్రేడ్‌–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్‌ వెరైటీకి రూ.1,815 చొప్పున అందిస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. గత ఏడాది ఖరీఫ్‌లో 40.41లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ప్రస్తుతం వరి సాగు పెరిగిన నేపథ్యంలో మరో 15 లక్షల టన్నుల మేర పెరిగే అధికంగా ఉండనుంది. గత ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు రూ.13,300 కోట్ల మేర వెచ్చించగా, ఈ ఏడాది అది మరో రూ.5 వేల కోట్ల మేర అదనంగా కలిపి రూ.18 వేల కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. మొదటగా కామారెడ్డి, నిజామాబాద్, జనగాం జిల్లాలో 15 నుంచి ధాన్యం సేకరణను ఆరంభించనున్నారు. అనంతరం వరి కోతను బట్టి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ– అకౌంటింగ్‌ నిర్వహించేలా, ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపరిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మరుగుదొడ్లు, షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్‌ మిషన్లు, మాయిశ్చర్‌ మీటర్లు, టార్పాలిన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచనున్నారు.

సీఎంఆర్‌ ఇవ్వకుంటే కఠిన చర్యలే..
నాణ్యత పరిశీలన కోసం కార్పొరేషన్‌ టెక్నికల్‌ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన థర్డ్‌పార్టీ బృందంతో కూడా తనిఖీలు చేయనున్నారు. ధాన్యం అందించిన 15 రోజుల్లో మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యాన్ని అప్పగించాలని మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎంఆర్‌ బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే ఆ మిల్లును బ్లాక్‌ లిస్టులో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడువులోగా మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వకపోతే ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగిస్తామని పేర్కొంది. మిల్లింగ్‌ కెపాసిటీని బట్టే ధాన్యాన్ని కేటాయించాలని, దీన్ని డీసీఎస్‌వోలు పర్యవేక్షించాలని సూచించింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పోలీసు ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తోంది.

ధాన్య సేకరణ కమిటీలు..
ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ చైర్మన్‌గా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్, పోలీస్‌శాఖ నుంచి ఒకరు, సీడబ్లు్యసీ రీజినల్‌ మేనేజర్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజింగ్‌ డైరెక్టర్, సెర్ప్‌ సీఈఓ, కో–ఆపరేషన్‌ కమిషనర్, ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి జిల్లా ఎస్‌పీ, నగర పోలీస్‌ కమిషనర్, జిల్లా లేబర్‌ ఆఫీసర్, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌లు కొత్తగా సభ్యులుగా చేర్చడం జరిగింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement