
ధాన్యం సొమ్మును పట్టేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుందామనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు సరికొత్త కష్టం వచ్చిపడింది. రుణమాఫీని పక్కనపెట్టడమే కాకుండా రైతులు తీసుకున్న రుణాలను తిరిగి రాబట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వ్యక్తిగత ఖాతాల్లో వేసిన డిపాజిట్లను రుణాలకు జమచేసుకున్న సంఘటనలు ఉన్నాయి.
తాజాగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యానికి చెల్లించాల్సిన నగదును బ్యాంకు బకాయిలకు జమ చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినా ఏ ఒక్క రైతుకూ పూర్తిగా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. రుణమాఫీ చేయకపోగా రైతుల నుంచి బకాయిలు వసూలుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఆధార్‌తో లింకు
జిల్లావ్యాప్తంగా 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటివరకు 150 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొదటి రకం టన్ను రూ.14వేలు, సాధారణ రకం రూ.13,600 చొప్పన కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును నేరుగా రైతుకు ఇవ్వకుండా ఆధార్, బ్యాంక్ అకౌంట్‌తో లింకుపెట్టి డబ్బులను రైతు ఖాతాలోకి మళ్లించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఆ మేరకు రైతుల నుంచి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకుంటున్నారు.
ఇప్పటికే సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో అధికారులు తొమ్మిదివేలమంది రైతుల నుంచి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి చెల్లించాల్సిన నగదును అప్పులకు జమచేసుకుంటున్నారని తెలుసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
దళారుల దందా...
బ్యాంకర్లు అప్పుల కింద జమచేసుకుంటున్నారని తెలుసుకున్న రైతులు ప్రైవేటుగా ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మిల్లర్లు, దళారీలు ఇదే అదనుగా సిండికేట్‌గా ఏర్పడి ధాన్యపు ధరలు ఒక్కసారిగా తగ్గించారు. పుట్టి ప్రభుత్వ ధర రూ.13,600 నుంచి రూ.14వేలు ఉంటే.. దళారులు ఒక్కసారిగా పుట్టి రూ.10వేలు నిర్ణయించారు. ఎంటీయూ 1010 రకం పుట్టి రెండ్రోజుల క్రితం రూ.11,800 వేలుకి కొనుగోలు చేశారు. అదే ధాన్యం ఇప్పుడు రూ.10వేలకి తగ్గించారు.
బీపీటీ 5204 (జిలకర మసూరి) రకం రూ.14వేలు ఉంటే.. రూ.12 వేలకు చేశారు. అంతటితో వదలకుండా తూకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎలక్రానిక్ కాటాల ద్వారా తూకం వేయాల్సి ఉంది. అయితే ఇటు అధికారులు కానీ, అటు దళారులు కానీ ఆ కాటాలను వినియోగించటం లేదు. మూడు కర్రలు ఏర్పాటు చేసి అందులో తూనికల, కొలత శాఖ ముద్రలు లేని గుండ్లు, రాళ్లు పెట్టి కాటాలు వేస్తుండటం గమనార్హం.
పాత బకాయిల కింద జమచేసుకుంటాం
రైతుల ధాన్యానికి సంబంధించిన సొమ్ము మా బ్యాంక్ ఖాతాలకు వస్తే.. సంబంధిత రైతు చెల్లించాల్సిన బకాయిల కింద జమచేసుకుని మిగిలిన సొమ్మును రైతులకు ఇస్తాం. రైతులకు రుణాలు కావాలంటే మార్చిపైన కొత్తవి ఇస్తాం.
- డేనియల్ ప్రసాద్, ఆంధ్రాబ్యాంక్, వాకాడు
ధాన్యం సొమ్మును రైతుకివ్వండి
కనీస మద్దతు ధరలేకపోయినా కష్టపడి పండించి అమ్ముకున్న ధాన్యం డబ్బులను అప్పుకు జమ చేసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలాగైతే తాము ఎలా బతకాలి. చేసిన అప్పులు ఎలా తీర్చేది. సొమ్మును నేరుగా రైతుకి ఇవ్వకుండా మిల్లర్లు, దళారీలు వారి బ్యాంక్ ఖాతాల్లో వేస్తే ఊరుకునేది లేదు.
-వంజివాక నారయ్య, వాకాడు.
డబ్బులు ఇవ్వరంటున్నారు
నాకు మూడున్నర ఎకరం పొలం ఉంది. వానలు లేక దిగుబడి తగ్గిపోయిం ది. వడ్లను కొనుగోలు కేంద్రానికి వేశాం. అయితే డబ్బులు ఇంకా ఇవ్వలేదు. గతంలో బ్యాంకు లో తీసుకున్న అప్పుకు జమ చేస్తారని చెబుతున్నారు. అలా చేస్తే మేమెట్లా బతకాలి. అందుకే మొన్న ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం అడిగారు. ముందే తెలిసి ఉంటే వడ్లు అమ్మేవాళ్లమే కాదు.
- కె.శ్రీనివాసులు, కాశీపురం.