ధాన్యం.. దళారుల పరం
ధాన్యం.. దళారుల పరం
Published Thu, May 4 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
పెనుమంట్ర/ఇరగవరం : అన్నదాతల శ్రమను దళారులు దోచుకుంటున్నారు. పంటలు బాగా పండినా ఆ ఫలితం ఆరుగాలం కష్టపడిన రైతుకు దక్కటం లేదు. జిల్లాలో ఈ సార్వాలో ఎకరాకు సగటున 45 నుంచి 54 బస్తాలు (బస్తా 75 కేజీలు) వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో రైతు కష్టం ఎంతో ఉన్నా అమ్ముకునే విషయంలో అడుగడుగునా మోసపోతున్నాడు. ఆదుకుంటా యనుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు వారిని గాలికొదిలేశాయి. దళారులు, మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తామే కొన్నట్టు రికార్డుల్లో రాసుకుని ప్రభుత్వం నుంచి కమీషన్లు తీసుకోవడానికే ఐకేపీ కేంద్రాలు పరిమితమయ్యాయి. దీనివల్ల ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్టపోతుండగా.. దళారులు రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఊరికో రేటు
జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నిర్ధిష్టమైన ధర అంటూలేదు. ఊరికో రకంగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. ఒక గ్రామంలో 1156 వరి రకం ధాన్యం 75 కేజీల ధర రూ.1,050 ఉంటే మరో గ్రామంలో రూ.వెయ్యికే కొంటున్నారు. ఇదేమిటని రైతులు అడిగితే.. దళారులు తేమ శాతం, తూకంలో తేడా, కామన్ రకం, తప్ప–తాలు ఉన్నాయంటూ రకరకాల సాకులు చెబుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లో పలుచోట్ల సూపర్ ఫైన్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,150 మాత్రమే చెల్లించారు. నిజానికి ఈ రకం ధాన్యానికి క్విం టాల్‌కు రూ.1,510 చెల్లించాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర. ఆ తరువాత ఎండలు ముదరటంతో ధాన్యంలో ఆరుదల శాతం బాగా పెరిగింది. దీంతో కొనుగోలు ధరను కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.1,220 వరకు చెల్లిస్తున్నారు. ధాన్యం రవాణా ఖర్చులు దళారులే భరిస్తుండటం వల్ల తక్కువ ధర చెల్లిస్తున్నారనుకున్నా క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.250 వరకు రైతులు నష్టపోతున్నారు. 75 కేజీల బస్తా ధాన్యానికి దళారులు రూ.1,100 నుంచి రూ.1,130 వరకు రేటు కడుతున్నా కాటా, కూలీ, ఎగుమతి, రవాణా చార్జీలు, ధాన్యంలో తేమ శాతం అంటూ రూ.100 నుంచి రూ.150 వరకు కోత విధిస్తున్నారు.
గోళ్లు గిల్లుకుంటున్న
ఐకేపీ కేంద్రాలు
ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోళ్లు గిల్లుకుంటున్నాయి. దాదాపు 100 కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యమైనా కొనుగోలు చేయలేదు. ఈ కేంద్రాల్లో గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, సాధారణ రకానికి రూ.1,470 కనీస మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా అక్కడికి ధాన్యం తీసుకెళితే.. కేంద్రాల నిర్వాహకులు సవాలక్ష నిబంధనలతో తిప్పి పంపుతున్నారు. ఆనక మిల్లర్లు, దళారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు చూపించి కమీషన్లు పొందుతున్నారు.
రూ.1,220కి అమ్మాను
నేను నెలమూరులో 11 ఎకరాల్లో 1011, బొండాలు వరి రకాలను సాగు చేశాను. ఎకరాకు సగటున 42 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్ ధాన్యాన్ని రూ.1220 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా అక్కడ అనేక ఆంక్షలు పెడుతున్నారు. పైగా సకాలంలో డబ్బు చేతికి రావడం లేదు. ఆర్థిక అవసరాల వల్ల నాలాంటి రైతులంతా దళారులకు అయినకాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది.– యరకరాజు సత్యనారాయణరాజు, రైతు, నెలమూరు
కొనుగోలు కేంద్రాలేవి
వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తోంది. మా మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణం. దిక్కులేని స్థితిలో కమీషన్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి.–కర్రి శ్రీనివాసరెడ్డి, రైతు, కంతేరు, ఇరగవరం మండలం
Advertisement
Advertisement