అద్భుత వరి వంగడాల రూపశిల్పి
జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్‌ఎంటీ రకం బియ్యపు మెతుకులే.
విదర్భలోని నాందేడ్ జిల్లా చండీపూర్ తాలుకాలోని నాగ్‌బీడ్ ఓ మారుమూల కుగ్రామం. దాదాజీ ఆవిష్కరించిన హెచ్‌ఎంటి ధాన్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. మూడో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దాదాజీ ఖోబ్రగడేకు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి చూడడం అలవాటు. నారుపోశామా, నాటేశామా, కోసి నూర్చి, మండీకి తోలామా.. అనే విధానం కాదు ఆయనది. మనస్ఫూర్తిగా నిమగ్నమై పని చేయడం ఆయనకు అలవాటు. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. ఉన్న ఎకరంన్నర పొలంలో ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పటేల్-3 రకం వరి సాగు చేశాడు. జబల్‌పూర్‌లోని జేఎన్‌కేవి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జేపి పటేల్ ఈ రకాన్ని అభివృద్ధి చేశాడు. పొలంలో వేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకునే దాదాజీ పంటపొలంలో ప్రతి అడుగును పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఓ మడి మూలన మూడు వరి వెన్నులు మిగతా చేనుకు భిన్నంగా కనిపించాయి. వెంటనే వెన్నులకు గుర్తులు పెట్టి ప్రత్యేకంగా కోసి నూర్చాడు. ఆ గింజలను భద్రంగా దాచి మరుసటి సంవత్సరం పంట సమయంలో ప్రత్యేకంగా నాటేసి అడవి జంతువుల పాలు కాకుండా చుట్టూ కంచెవేశాడు. ఈసారి వచ్చిన దిగుబడిని మరోమారు జాగ్రత్తగా తిరిగి సాగు చేశాడు. కొత్తవిత్తనం సంరక్షణ ప్రస్థానం సాగుతూ 1988 నాటికి నాలుగున్నర క్వింటాళ్ల విత్తనం చేతికి వచ్చింది. బియ్యం మరపట్టించి చూడగా 80 శాతం బియ్యం దిగుబడి వచ్చింది. పటేల్ రకంతో పోలిస్తే అన్నం నాణ్యంగా, రుచికరంగా ఉంది. తన పంట గొప్పతనం గుర్తించిన దాదాజీ ఖోబ్రగడే ఈసారి 150 కిలోల ధాన్యాన్ని విత్తాడు. దాదాజీ ఆశలు ఫలించి 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. 1990లో దాదాజీ వద్ద విత్తనం తీసుకున్న బీమ్‌రావ్ షిండే అనే భూస్వామి నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఆచేత, ఈచేత చుట్టుపక్కల రైతులకు చేరిన ఈ విత్తనం ఆ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగైంది. మార్కెట్‌లో కొత్త రకం మేలిమి ధాన్యం రాశులుగా పోగుపడగా వ్యాపారులు ఆనందం వ్యకం చేశారు. తలోడి మార్కెట్ వ్యాపారి ఒకడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఆనాటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న హెచ్‌ఎంటి గడియారం స్ఫూర్తితో హెచ్‌ఎంటీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇది సాగవుతోంది.
అసలు కథ అప్పుడు మొదలయింది. కోబ్రాగడే ఘనతను చూసి కొందరు పెద్దమనుషులకు కన్నుకుట్టింది. ఓ దళిత రైతు విత్తనాన్ని రూపొందించడం వారికి నచ్చలేదు. అతనికి అందుతున్న ఖ్యాతిని కాజేయాలని ‘ఈనగాచిన చేను నక్కలు నమిలేసినట్లు’ నిరుపేద దళిత రైతు కష్టఫలితాన్ని కొల్లగొట్టడానికి కుట్రచేశారు. హెచ్‌ఎంటీ ధాన్యానికి ముందు ఒక తోక తగిలించి పీకేవి హెచ్‌ఎంటీగా పేరు పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక ప్రతినిధి ఈ కుట్రను బట్టబయలు చేయడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఖోబ్రగడేకు మద్దతుగా ముందుకొచ్చాయి. న్యాయపోరాటంతో పాటు, శాస్త్రీయ పరీక్షలు జరిపించి నిజాన్ని నిగ్గుతేల్చగా హెచ్‌ఎంటీ, పెద్ద మనుషులు చెలామణిలోకి తెచ్చిన హెచ్‌ఎంటీకి ఎలాంటి తేడాలేదని తేలిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రెండు వంగడాల జన్యుపటాలను చిత్రించగా ఎలాంటి తేడాలు లేవని వెల్లడయింది. ఈ విషయం నాగ్‌పూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కు తెలియపర్చింది. ఎన్‌ఐఎఫ్ దాదాజీ రాంజీ ఖోబ్రగడే కృషిని గుర్తించి 2005లో జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
దాదాజీ విత్తనాభివృద్ధి ప్రస్థానం హెచ్‌ఎంటీతో ఆగిపోలేదు. 1987లో మరో రకం ధాన్యానికి ఊపిరి పోసి.. దానికి తన మనవడు నాందేడ్ చిన్నూర్ పేరు పెట్టారు. 1994లో నాందేడ్ హీరా, 1996లో విజయ్ నాందేడ్, 1997లో దీపక్ రత్న రకాలను సృష్టించి మనుమల పేర్లు పెట్టాడు. 1998లో తన పేరుతోనే డీఆర్‌కె (దాదాజీ రాంజీ ఖోబ్రగడే) రకాన్ని సృష్టించాడు. 2002లో కాటే హెచ్‌ఎంటీ, 2003లో డీఆర్‌కె సుగంధి రకానికి ఊపిరి పోశాడు. దాదాజీ మొత్తం 9 రకాల వరి వంగడాలను సృష్టించాడు. ఇందులో హెచ్‌ఎంటీ రకం ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల హెక్టార్లలో సాగవుతున్నదంటే.. దాని గొప్పదనం అర్థమౌతుంది. మన్నులోంచి అన్నం తీసే రైతన్నల ఆశలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని అందించిన ఖోబ్రగడేని కుల వివక్ష అణగదొక్కిందని మహారాష్ట్రలో అనేక మంది మేథావులు విమర్శించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కుట్రను తూర్పారబట్టాయి. రైతు క్షేత్ర స్థాయి పరిజ్ఞానానికి శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసి వెనవేల సృజనలు చేయగలరని దాదాజీ రాంజీ ఖోబ్రగడే నిరూపించాడు.
విత్తనాలకు: ఖోబ్రగడే వరి వంగడాలను సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేక విత్తనోత్పత్తి సహకార సంఘాల ద్వారా రబీ నాటికి రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు డా. రాజశేఖర్(7386145368)కు ఫోన్ చేసి రిజర్వు చేసుకోవచ్చు. ఖోబ్రగడేను 09767290201 నంబరులో సంప్రదించవచ్చు.
- జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్