Jitta bal Reddy
-
ప్రకృతి సేద్యం.. వర్షానికీ ఇష్టమే!
వర్షం కురిసే అవకాశాలను భూమిలోని జీవనద్రవ్యం (హ్యూమస్) 160% పెంపొందిస్తుంది తన పరిమాణానికి 4 రెట్లు నీటిని పట్టి ఉంచే గుణం జీవనద్రవ్యానికి ఉంది సామూహిక ప్రకృతి సేద్యంతోనే సత్ఫలితాలని అమెరికా పరిశోధన లో వెల్లడి కోరినప్పుడు వాన కురిస్తే... అబ్బో ఆశ... అసలే అడగొద్దంటే కోరి కొసరు పెట్టమన్నట్లుంది అనుకుంటున్నారా? నిజమే కానీ నేలకు నింగికి ఉన్న సంబంధం తెలుసుకుంటే ఈ చిక్కుముడి వీడిపోతుందంటున్నారు పలువురు ప్రకృతి వ్యవసాయ నిపుణులు. శాస్త్రవేత్తలు ఎందరో ఇదే విషయమై అన్వేషణ సాగిస్తున్నారు. నేలలో ఉన్న జీవనద్రవ్యం(హ్యూమస్) కదిలిపోయే కారు మేఘాలను ఆకర్షించి పిలిచి కురిపిస్తుందంటున్నారు అమెరికాకు చెందిన గ్లేన్ మోరిస్. ‘మన నేలలోని జీవనద్రవ్యం జీవ ప్రపంచ నిలయం. ఇటీవల అమెరికాలో జరిగిన శాస్త్రపరిశోధనలు నేలలోని జీవనద్రవ్యం వర్షం కురిసే అవకాశాలను 160 శాతం పెంచుతుందని వెల్లడిస్తున్నాయి. వర్షం కురవడానికి అనువైన పరిస్థితిని ఏర్పర్చడానికి ఈ జీవావరణం ఉపయోగపడుతుందని ఆ ఫలితాల సారాంశం’ అంటున్నారు గ్లేన్ మోరీస్. ఇది ఒక రకంగా కృత్రిమంగా వర్షం కురిపించడమే. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ‘క్లౌడ్ సీడింగ్’. ఇక మోరీస్ విషయానికి వస్తే ఈయన సేంద్రియ పశుమాంస ఉత్పత్తిదారుడు. గత సంవత్సరం అమెరికా ప్రభుత్వం నుంచి భూ సంరక్షణ అవార్డును అందుకున్నవాడు. నేలలోని జీవనద్రవ్యం (హ్యూమస్)- వర్షాన్ని ఆకర్షించే వృక్ష సంబంధ జీవుల మధ్య గల సంబంధంపై స్నాతకోత్తర పరిశోధన కొనసాగిస్తున్నాడు. ఒక దశాబ్దం కిందట ఈయనకున్న భూములు బీడువారి, నెర్రెలు బాసి నోరు తెరిచిన స్థితిలో ఉండేవి. వాతావరణం ప్రతికూలమై జల చక్రం గాడితప్పిన పరిస్థితి. అసలు తేమనేదే లేకుండా భూమి పొడారిపోయింది. నేలలో జీవనద్రవ్యం, సేంద్రియ కర్బనం అడుగంటిపోవడంతో కురిసిన చినుకు తడిని బొత్తిగా నిలుపుకోలేని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇదే విషయమై మోరీస్ పరిశోధన జరిపాడు. జీవనద్రవ్యం, సేంద్రియ పదార్ధాలను పెంపొందించడం వలన భూమిలో ఏ మేరకు నీటిని నిలువరించవచ్చో లెక్కతీశాడు. రెండేళ్ల అనంతరం ఆయన పరిశోధన కొలిక్కొచ్చింది. నేలలో జీవనద్రవ్యం పరిమాణానికి నీటిని పట్టి ఉంచే శక్తి 1:4 పాళ్లలో ఉంటుందని తేల్చాడు. అంటే నేలలో ఒక శాతం జీవనద్రవ్యం పెరిగితే 1,60,000 లీటర్ల నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని తేల్చాడు. మోరీస్ ఇంకా ఇలా అన్నాడు: ‘మన గడ్డి బీళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ముఖ్యంగా గడ్డి కోతకు వచ్చే ముందు, తిరిగి విత్తే ముందు విశ్రాంతి అవసరం. గడ్డిభూమి కోల్పోయిన శక్తిని తిరిగి సమీకరించుకొని జీవనద్రవ్యాన్ని పెంపొందించుకుంటుంది. తద్వారా నేల పునరుజ్జీవన చర్యలు చేపట్టవచ్చు. దీనితో కొంతమార్పు వస్తుంది. అయితే చుట్టుపక్కల రైతులందరూ ఇదే విధానం కొనసాగిస్తే ఆ ప్రాంతంలో సహజ ‘క్లౌడ్ సీడింగ్’కు బీజాలు వేసినట్లే’. సిడ్నీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ లచ్లాన్ ఇంగ్రామ్ స్పందిస్తూ.. ‘నేలలో ఉన్న సేంద్రియ పదార్థం నిల్వలకు నీటిని పట్టి ఉంచే శక్తికి మధ్య బలమైన సంబంధం ఉంది. నేలలో ఉన్న జీవన ద్రవ్యం సూక్ష్మనీటి బిందువుల సమూహాన్ని విడుదల చేస్తుంది. అవి మేఘాలను ఆకర్షిస్తాయి. వర్షం కురవడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయనే విషయంలో సందేహం లేదు. ఒక క్షేత్రంలో ఇవి విడుదలయినా గాలి ప్రభావంతో అవి సుదూర ప్రాంతానికి కొట్టుకుపోయి అక్కడ వర్షం కురవడానికి కారణం కావచ్చు’ అని వివరించారు. ప్రకృతి సేద్య విధానం అవలంబించడం ద్వారా గతి తప్పిన రుతుచక్రాన్ని సరిదిద్దగలుగుతుందనేది ఈ పరిశోధన వెల్లడించిన నిర్ధారిత నిజం. అందుకే ప్రకృతి వ్యవసాయమే నేటి ఆచరణీయ కార్యాచరణ. భూగోళం అమితంగా వేడెక్కడానికి కాయకల్ప చికిత్స అనేది కాదనలేని సత్యం. - జిట్టా బాల్‌రెడ్డి -
అద్భుత వరి వంగడాల రూపశిల్పి
జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్ఎంటీ రకం బియ్యపు మెతుకులే. విదర్భలోని నాందేడ్ జిల్లా చండీపూర్ తాలుకాలోని నాగ్బీడ్ ఓ మారుమూల కుగ్రామం. దాదాజీ ఆవిష్కరించిన హెచ్ఎంటి ధాన్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. మూడో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దాదాజీ ఖోబ్రగడేకు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి చూడడం అలవాటు. నారుపోశామా, నాటేశామా, కోసి నూర్చి, మండీకి తోలామా.. అనే విధానం కాదు ఆయనది. మనస్ఫూర్తిగా నిమగ్నమై పని చేయడం ఆయనకు అలవాటు. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. ఉన్న ఎకరంన్నర పొలంలో ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పటేల్-3 రకం వరి సాగు చేశాడు. జబల్పూర్లోని జేఎన్కేవి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జేపి పటేల్ ఈ రకాన్ని అభివృద్ధి చేశాడు. పొలంలో వేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకునే దాదాజీ పంటపొలంలో ప్రతి అడుగును పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఓ మడి మూలన మూడు వరి వెన్నులు మిగతా చేనుకు భిన్నంగా కనిపించాయి. వెంటనే వెన్నులకు గుర్తులు పెట్టి ప్రత్యేకంగా కోసి నూర్చాడు. ఆ గింజలను భద్రంగా దాచి మరుసటి సంవత్సరం పంట సమయంలో ప్రత్యేకంగా నాటేసి అడవి జంతువుల పాలు కాకుండా చుట్టూ కంచెవేశాడు. ఈసారి వచ్చిన దిగుబడిని మరోమారు జాగ్రత్తగా తిరిగి సాగు చేశాడు. కొత్తవిత్తనం సంరక్షణ ప్రస్థానం సాగుతూ 1988 నాటికి నాలుగున్నర క్వింటాళ్ల విత్తనం చేతికి వచ్చింది. బియ్యం మరపట్టించి చూడగా 80 శాతం బియ్యం దిగుబడి వచ్చింది. పటేల్ రకంతో పోలిస్తే అన్నం నాణ్యంగా, రుచికరంగా ఉంది. తన పంట గొప్పతనం గుర్తించిన దాదాజీ ఖోబ్రగడే ఈసారి 150 కిలోల ధాన్యాన్ని విత్తాడు. దాదాజీ ఆశలు ఫలించి 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. 1990లో దాదాజీ వద్ద విత్తనం తీసుకున్న బీమ్‌రావ్ షిండే అనే భూస్వామి నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఆచేత, ఈచేత చుట్టుపక్కల రైతులకు చేరిన ఈ విత్తనం ఆ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగైంది. మార్కెట్లో కొత్త రకం మేలిమి ధాన్యం రాశులుగా పోగుపడగా వ్యాపారులు ఆనందం వ్యకం చేశారు. తలోడి మార్కెట్ వ్యాపారి ఒకడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఆనాటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న హెచ్ఎంటి గడియారం స్ఫూర్తితో హెచ్ఎంటీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇది సాగవుతోంది. అసలు కథ అప్పుడు మొదలయింది. కోబ్రాగడే ఘనతను చూసి కొందరు పెద్దమనుషులకు కన్నుకుట్టింది. ఓ దళిత రైతు విత్తనాన్ని రూపొందించడం వారికి నచ్చలేదు. అతనికి అందుతున్న ఖ్యాతిని కాజేయాలని ‘ఈనగాచిన చేను నక్కలు నమిలేసినట్లు’ నిరుపేద దళిత రైతు కష్టఫలితాన్ని కొల్లగొట్టడానికి కుట్రచేశారు. హెచ్ఎంటీ ధాన్యానికి ముందు ఒక తోక తగిలించి పీకేవి హెచ్ఎంటీగా పేరు పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక ప్రతినిధి ఈ కుట్రను బట్టబయలు చేయడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఖోబ్రగడేకు మద్దతుగా ముందుకొచ్చాయి. న్యాయపోరాటంతో పాటు, శాస్త్రీయ పరీక్షలు జరిపించి నిజాన్ని నిగ్గుతేల్చగా హెచ్ఎంటీ, పెద్ద మనుషులు చెలామణిలోకి తెచ్చిన హెచ్‌ఎంటీకి ఎలాంటి తేడాలేదని తేలిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రెండు వంగడాల జన్యుపటాలను చిత్రించగా ఎలాంటి తేడాలు లేవని వెల్లడయింది. ఈ విషయం నాగ్‌పూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కు తెలియపర్చింది. ఎన్ఐఎఫ్ దాదాజీ రాంజీ ఖోబ్రగడే కృషిని గుర్తించి 2005లో జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దాదాజీ విత్తనాభివృద్ధి ప్రస్థానం హెచ్‌ఎంటీతో ఆగిపోలేదు. 1987లో మరో రకం ధాన్యానికి ఊపిరి పోసి.. దానికి తన మనవడు నాందేడ్ చిన్నూర్ పేరు పెట్టారు. 1994లో నాందేడ్ హీరా, 1996లో విజయ్ నాందేడ్, 1997లో దీపక్ రత్న రకాలను సృష్టించి మనుమల పేర్లు పెట్టాడు. 1998లో తన పేరుతోనే డీఆర్‌కె (దాదాజీ రాంజీ ఖోబ్రగడే) రకాన్ని సృష్టించాడు. 2002లో కాటే హెచ్ఎంటీ, 2003లో డీఆర్‌కె సుగంధి రకానికి ఊపిరి పోశాడు. దాదాజీ మొత్తం 9 రకాల వరి వంగడాలను సృష్టించాడు. ఇందులో హెచ్ఎంటీ రకం ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల హెక్టార్లలో సాగవుతున్నదంటే.. దాని గొప్పదనం అర్థమౌతుంది. మన్నులోంచి అన్నం తీసే రైతన్నల ఆశలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని అందించిన ఖోబ్రగడేని కుల వివక్ష అణగదొక్కిందని మహారాష్ట్రలో అనేక మంది మేథావులు విమర్శించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కుట్రను తూర్పారబట్టాయి. రైతు క్షేత్ర స్థాయి పరిజ్ఞానానికి శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసి వెనవేల సృజనలు చేయగలరని దాదాజీ రాంజీ ఖోబ్రగడే నిరూపించాడు. విత్తనాలకు: ఖోబ్రగడే వరి వంగడాలను సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేక విత్తనోత్పత్తి సహకార సంఘాల ద్వారా రబీ నాటికి రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు డా. రాజశేఖర్(7386145368)కు ఫోన్ చేసి రిజర్వు చేసుకోవచ్చు. ఖోబ్రగడేను 09767290201 నంబరులో సంప్రదించవచ్చు. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ -
పాలీహౌస్లో పంట సిరి!
పుణే కేంద్రంగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం పావెకరం(25 సెంట్లు) పంట పొలం. అంగుళం నీరు, గంట కరెంట్‌తో వ్యవసాయం సాగిస్తే... అబ్బో అయ్యగారి చేను కొయ్యా? మొయ్యా? అని నలుగురూ పగలబడి నవ్వుతారు. అయితే.. సరిగ్గా ఇవే వనరులతో ఏడాదికి రూ.8 లక్షలు కళ్లజూస్తున్నారు మహారాష్ట్ర రైతులు. ఆశ్చర్యంగా అనిపించినా.. అతిశయోక్తిగా భావించినా.. పుణే నగరం సమీపంలోని ిహింజేవాడి గ్రామం వెళ్లి చూడండి. నిజం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. యువ రైతు దానేశ్వర్ బోడ్కే సారథ్యంలో లాభసాటిగా సమష్టి వ్యవసాయం స్థానిక వినియోగదారుల అవసరం మేరకే పంటల సాగు.. డోర్ డెలివరీ సొంత మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా పూలు, కూరగాయల అమ్మకం.. స్వయం సహాయక బృందాలకు భాగస్వామ్యం పుణే-ముంబై జాతీయ రహదారికి ఆవలివైపు విసిరేసినట్టుగా ఉండే హింజేవాడికి చెందిన దానే శ్వర్ బోడ్కే అనే యువరైతు మదిలో మెదిలిన ఆలోచన.. కార్యరూపం దాల్చి రైతుల ఇంట పంట సిరులు కురిపిస్తోంది. సరిగ్గా వెయ్యి గజాలు లేదా పావు ఎకరం స్థలంలోని పాలీహౌస్‌లలో పూలు, కూరగాయలు పండిస్తూ అధికాదాయం పొందుతున్నారు. పుణే ఐటీ హబ్ తలేగావ్‌కు చివరన ఉండే హింజేవాడి ఒకప్పుడు మారుమూల గ్రామం. సంప్రదాయ పద్ధతిలో జొన్న, మొక్కజొన్న, పత్తి, చెరకు తదితర పంటలను సాగు చేసేవారు. ఆరుగాలం శ్రమను సాలాఖరుకు లెక్కేసుకుంటే అప్పులు, వడ్డీలు పోను చేతిలో మిగిలేది హళ్లికి హళ్లి.. సున్నకు సున్న! ఐటీ కంపెనీలు వచ్చిన తరువాత ఈ ప్రాంత భూముల ధరకు రెక్కలొచ్చాయి. జీవితకాలంలో ఎన్నడూ కళ్లజూడని డబ్బు.. ఎకరం భూమి 40 లక్షల చొప్పున అడిగినవాడికి అడిగినట్లు అమ్ముకున్నారు. చేతిలో పడిన డబ్బు హారతి కర్పూరమయ్యాక యువకులు ఐటీ హబ్‌లో చిరుద్యోగులుగా మారారు. వీరికి భిన్నంగా దూరదృష్టితో కదిలాడు దానేశ్వర్ బోడ్కే. పాలీహౌస్ వ్యవసాయాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాడు. కష్టాలే రాటుదేల్చాయి! బోడ్కే తండ్రి 16 ఎకరాల రైతు. రూ. 20 వేల అప్పు రూ. లక్షన్నరకు పెరిగి వ్యవసాయం తలకు చుట్టిన పాములా మారింది. కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి దాటే యడానికి బోడ్కే మొదట చిరుద్యోగాలు చేశాడు. ఇంటీ రియర్ డిజైనింగ్ కోర్సు చేశాక ఒక మోస్తరు ఆదాయం పొందే స్థాయికి చేరాడు. అయినా.. ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన వెంటాడింది. ఆ దశలో తలెగావ్‌లోని ప్రభుత్వ ఉద్యాన కళాశాల పాలీహౌస్ వ్యవసాయంపై 2 రోజుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వా నించింది. మరో ఆలోచన లేకుండా శిక్షణ పొందాడు. అయితే పాలీహౌస్లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించడానికి ఆ 2 రోజుల శిక్షణ సరిపోదనిపించింది. ఉద్యాన కళాశాల ప్రొఫెసర్‌ను బతిమిలాడి సంవత్సరం పాటు వేతనం లేని శిక్షణా కార్మికుడిగా పనిలో చేరాడు. పాలీహౌస్ నిర్మాణం నుంచి నిర్వాహణ వరకు అన్ని పనులనూ ఆకళింపు చేసుకున్నాడు. అనుభవమైతే సాధించాడు కానీ.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు తగినంత ఆర్థిక శక్తి లేదు. విసుగు, విరామం లేకుండా నెలల తరబడి తిరిగి కెనరా బ్యాంక్ రుణం పొందాడు. కేవలం 5 గుంటల(20 సెంట్ల) స్థలంలో తొలి పాలీహౌస్ నిర్మించాడు బోడ్కే. కార్నిషియన్ పూలే సాగు చేసి ఏడాదిలోనే అప్పు తీర్చేశాడు. పుణే నగరంలో అప్పు డప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య పరిశ్రమదారులు ఐస్‌బర్గ్ లెట్యూస్, బ్రకోలీ, కోలే, పార్స్లే, సలేరీ, లూలూరోసా, చెర్రీ టమాటా, చైనా క్యాబేజీ వంటి విదేశీ కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించాడు. తన పాలీ హౌస్‌లో సాగు చేసి సరఫరా చేయడంతో ఆదా యం బాగా పెరిగింది. బోడ్కే అంతటితో సంతృప్తి చెందలేదు. అభినవ్ ఫార్మర్స్ క్లబ్ అవతరణ రైతు పంటలు పండించడమే కాదు.. తన సరుకును ప్రణాళికాబద్ధంగా అమ్ముకుంటేనే తగిన ప్రతిఫలం ఉంటుందని భావించిన బోడ్కే.. నలుగురినీ కూడగట్టి రైతుల సంఘటిత శక్తిని చాటాడు. కొద్దిమంది పాలీహౌస్ సాగుదారులతో 2004లో ఏర్పాటైన అభినవ్ ఫార్మర్స్ క్లబ్లో సభ్యుల సంఖ్య 640కు పెరిగింది. 2008లో క్లబ్‌కు జాతీయ పురస్కారం లభించింది. బోడ్కే తన కార్యకలాపాలను హింజేవాడి నుంచి మహారాష్ట్ర అంతటికీ విస్తరింపజేశాడు. వెయ్యికి పైగా పాలీహౌస్‌లు ఏర్పాటు అయ్యాయి. వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయలు పాలీహౌస్‌ల సంఖ్య పెరిగిన తరువాత మార్కెట్లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. పండించిన కూర గాయలను నేరుగా వినియోగదారుడి ఇంటి గుమ్మంలోకే చేర్చాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. రైతులు పండించిన కూరగాయలను ఒక చోటకు చేర్చి ప్యాకింగ్ చేసే పనిని స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. దీంతో అభినవ్ ఫామ్స్‌కు అనుబంధంగా మహిళా సంఘం ఏర్పాటైంది. వినియోగదారుల అవసరాలకనుగుణంగా వారానికి సరిపడే 7 రకాల కూరగాయలు ప్యాక్ చేసి నేరుగా ఇంటికి చేర్చుతున్నారు. దానికి అనుగుణంగా వివిధ పంటలను సాగుచేస్తున్నారు. బోడ్కే ఆధ్వర్యంలోని అభినవ్ ఫార్మర్స్ క్లబ్ తన కార్యక్రమాలను గుజరాత్, మధ్య ప్రదేశ్‌లకూ విస్తరింపజేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకూ శిక్షణ అందిస్తోంది. - జిట్టా బాల్ రెడ్డి, ‘సాక్షి’ సాగుబడి డెస్క్ పశువుల ఎరువు.. వరిపొట్టు.. అమృత్‌పానీ! ఇదీ బోడ్కే పాలీహౌస్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి నియంత్రిత వాతావరణంలో పంటల సాగు కాబట్టి.. సాధారణ పాలీహౌస్లో సస్యరక్షణ మందుల వినియోగం ఎక్కువే. అయితే, ప్రజల్లో ఆరోగ్య స్పృహతో పాటు సేంద్రియ ఆహారానికి గిరాకీ పెరగడాన్ని బోడ్కే గుర్తించాడు. పాలీహౌస్‌ల లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రూపొందించారు. పాలీహౌస్‌లోని 10 గజాల స్థలంలో ఉత్తర, దక్షిణాల మధ్య దుక్కి దున్ని రోటవేటర్‌తో భూమిని సమంగా చేస్తారు. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. మధ్యలో 40 సెంటీమీటర్ల మేర దారి వదలిపెడతారు. సమంగా చేసిన నేల మీద చివికిన పశువుల ఎరువు ఒక వరుస, దాని మీద వరి పొట్టు మరో వరుస వేస్తారు. మూడో వరుసగా ఇసుక పోస్తారు. దీన్ని రోటవేటర్‌తో దున్ని ఒక్కో వైపు 25 చొప్పున బోదెలు చేసి కూరగాయ మొక్కలు నాటుతారు. మొక్కలకు రోజూ ఉదయం 7 గంటల నుంచి 20 నిమిషాలపాటు డ్రిప్ ద్వారా నీరందిస్తారు. తేనె, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రాలతో తయారు చేసే ‘అమృత్‌పానీ’ అనే ద్రావణ ఎరువును వారానికి ఒకసారి పిచికారీ చేస్తారు. క్రిమిసంహారిణిగా 10,000 పీపీఎం వేప నూనె, ఆవు మూత్రంను నీటిలో 3 నుంచి 5 శాతం వరకు కలిపి పిచికారీ చేస్తారు. వ్యవసాయం లాభదాయకమే! రైతు ఎవరినీ దేన్నీ ఉచితంగా అడగకూడదు, దేన్నీ ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. వ్యవసాయోత్పత్తులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. వ్యవసాయం లాభదాయకమైనదే. యువతరం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలు స్వయం సమృద్ధం కావాలి. - దానేశ్వర్ బోడ్కే, అభినవ్ ఫార్మర్స్ క్లబ్, పుణే చిరునామా: అభినవ్ ఫార్మర్స్ క్లబ్, ిహింజేవాడి గ్రామం, ముల్సి తాలూకా, పుణె జిల్లా, మహారాష్ట్ర ఫోన్స్: 09422005389, 0808-7690912 email: abinavfarmersclub@gmail.com