
వరికి మించిన ‘మద్దతు'
దేవరకద్ర : ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను మించి ధాన్యం ధరలు పలుకుతున్నాయి. రబీ తరువాత వేసవి లో కత్తెర పంటకింద సాగుచేసిన రైతులు ప్రస్తుతం కోతలు చేసి పంట మార్పిడి త రువాత మార్కెట్‌కు వరి ధాన్యాన్ని పెద్దఎత్తున అమ్మకానికి తెస్తున్నారు. 10101 రకం వడ్లతో పాటు హంస వడ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. గ్రేడ్ వన్‌గా ఉన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 1400 ఉండగా దేవరకద్ర మార్కెట్‌లో రూ. 1600కు పైగా ధర పలుకుతుంది. ఇక రెండో రకం వడ్లకు రూ. 1400కు పైగా ధరలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ప్రస్తుతం మందకొడిగా వ్యాపారం సాగుతున్నది. ప్రతి రోజు మూడు వందల నుంచి అయిదు వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వస్తున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీనికితోడు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తుండడంతో రైతులు వారికే ధాన్యం అమ్ముకుంటున్నారు.
నేరుగా కొనుగోళ్లు..
మార్కెట్‌లో వ్యాపారులు నేరుగా రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. గతంలో కేవలం మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని టెండర్ వేసి కొనుగోళ్లు చేసేవారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్‌మిల్లు యజమానులు మార్కెట్ వ్యాపారులు కావడంతో నేరుగా పోటిపడి ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. గోప్లాపూర, ఎలిగండ్ల సమీపంలో గత ఏడాది నుంచి బాయిల్డ్ రైస్ మిల్లులు ప్రారంభం అయిన తరువాత వ్యాపారులు నేరుగా మిల్లుల ద్వార ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇవ్వడంతో పాటు హమాలీ కమీషన్ లేకుండా రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉండడంతో చాలామంది రైతులు మార్కెట్‌కు రాకుండా మిల్లులకు నేరుగా వెళ్తున్నారు.
నాణ్యమైన దిగుబడి.....
కత్తెర పంట కింద సాగుచేసిన వరి ధాన్యం నాణ్యమైన దిగుబడిగా ఉంటుందని అందుకే ధరలు అధికంగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. క్వింటాల్ వడ్లకు బియ్యం శాతం అధికంగా వస్తుందని అలాగే నూకల శాతం తక్కువగా ఉంటుందని అందుకే కత్తెర పంట కింద వచ్చే వడ్లను ఎంత ధరయినా చెల్లించడానికి వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్ పంటల కన్నా కత్తెర పంట కింద వచ్చే హంస వడ్లు నాణ్యంగా ఉంటాయని తెలిపారు.