అకాల వర్షం.. ఆగమాగం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, సంగెం, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట, నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలాల్లో వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలమట్టమైంది. ఇంకా ఈదురు గాలులతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ వర్ధన్నపేట మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.
సూర్యాపేట జిల్లాలో తడిసిన ధాన్యం
అర్వపల్లి/ తిరుమలగిరి: సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షానికి జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, రామన్నగూడెం, కొమ్మాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై పట్టాలు కప్పుకున్నా కొంత మేర తడిసింది. రామన్నగూడెం పీఏసీఎస్ కేంద్రం బండపై ఉండటంతో ధాన్యం కుప్పల మధ్య నీళ్లు నిలిచాయి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం బస్తాలు తడిశాయి.