కొత్తగా 21 గిడ్డంగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రత్యేకంగా గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలె యాదయ్యలతో కలిసి మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పది మార్కెట్ కమిటీల పరిధిలో గిడ్డంగుల నిర్మాణాలకు స్థలం అనుకూలంగా ఉందన్నారు.
వాటి నిర్మాణాలకు రూ.13.20కోట్లతో మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు తయారు చేసిందని, వీటిని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని చెప్పారు. ఈమేరకు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో 11 గిడ్డంగులు అవసరమని, వాటికి రూ.6.6కోట్లు కావాల్సిఉందని అన్నారు. ఈమేరకు ఆ శాఖ తయారు చేసిన ప్రణాళికలను ఆయన పరిశీలించారు. స్థల సేకరణకు సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.