ధాన్యం మీది.. భద్రత మాది | we are responsible for Grain | Sakshi
Sakshi News home page

ధాన్యం మీది.. భద్రత మాది

Published Fri, Oct 17 2014 2:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

we are responsible for Grain

ఒంగోలు టూటౌన్ :  రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి భద్రత కల్పిస్తామని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) రీజినల్ మేనేజర్ పీఈ ప్రసాద్ భరోసా ఇచ్చారు. స్థానిక వ్యవసాయమార్కెట్ కమిటీ మేనేజర్ రామమోహన్ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం నిల్వలపై రైతులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ..  రైతుల సంక్షేమమే సెంట్రల్ వేర్‌హౌసింగ్ లక్ష్యమని అన్నారు. రైతులు గోడౌన్లలో నిల్వ చేసిన ధాన్యం విలువను బట్టి రుణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

జిల్లా వ్యవసాయశాఖ సంచాలకుడు జే మురళీకృష్ణ మాట్లాడుతూ.. గోడౌన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే భద్రత ఉంటుందని తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే వీలుందని చెప్పారు. ఏరువాక కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ వరప్రసాదరావు మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ చేసే ఆహార ధాన్యాలను ఆశించే క్రిమికీటకాలు, వాటి జీవన విధానాం, నివారించే పద్ధతులను వివరించారు. పురుగు మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సీనియర్ మేనేజర్ పివిఆర్ ఫణికుమార్ మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ చేసుకున్న ధాన్యంపై కల్పించే రుణ సదుపాయం గురించి వివరించారు. శాస్త్రవేత్త అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. పంట కోత అనంతరం నిల్వలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.

గోడౌన్లలో సౌకర్యాలపై ప్రశ్నించిన రైతులు
కేంద్ర గిడ్డంగుల సంస్థలో అధునాతన సౌకర్యాలు లేకుండా ధాన్యం నిల్వలు ఎలా చేస్తారని రమణారెడ్డి అనే రైతు అధికారులను ప్రశ్నించారు. పాత గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు ఎలా సాధ్యమని అధికారులను అడిగారు. ధాన్యం నిల్వలకు సరిపడా ఉష్ణోగ్రతను కల్పించే సౌకర్యం కేంద్ర గిడ్డంగుల సంస్థలో ఉందా అని నిలదీశారు. అధునాతన వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమం అనంతరం శిక్షణకు వచ్చిన రైతులకు సర్టిఫికెట్లు, ధాన్యం నిల్వ చేసుకునే మెటల్ డ్రమ్ములను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డిప్యూటీ డెరైక్టర్ ఆర్ జగన్నాథం, కొత్తపట్నం, సంతనూతలపాడు వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement