మిల్లర్ల అక్రమాలకు చెక్!
Published Fri, Aug 23 2013 3:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైస్ మిల్లర్ల ఆధిపత్యానికి, అక్రమాలకు చెక్ పడనుంది. అందు కు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు లెవీ సేకరణలో నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొంత మంది మిల్లర్లు తమకున్న పలుకుబడిని అడ్డంగా పెట్టుకొని లెవీలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు దొడ్డిదారిన బియ్యా న్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నూతన విధానంతో వాటికి చెక్ పడనుంది. ప్రతి మిల్లరు తాను కొనుగోలు చేసే ధాన్యంలో 75 శాతం లెవీకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా ప్రజా అవసరాల కోసం పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకూ జిల్లా యూ నిట్‌గా లెవీ సేకరణ చేస్తోంది. కొత్త విధానం ఈ అక్టోబర్ నుంచి అమలు కానుంది. ఈ మేర కు జీఓ నంబర్ 18ని జారీచేశారు. ఈ విధానం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు కానుంది.
75 శాతం బియ్యం లెవీకి...
ప్రతి రైస్‌మిల్లులో తయారైన బియ్యంలో 75 శాతం ప్రభుత్వానికి లెవీ రూపంలో అందించవలసి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నా...రైస్‌మిల్లుల యజ మానులు నిబంధనలను సక్రమంగా పాటించ డం లేదు. 60 నుంచి 70 శాతం మాత్రమే లెవీ ఇస్తున్నారు. నూతన విధానంతో తప్పని సరిగా 75 శాతం లెవీకి అందజేయాలి. జిల్లాలో 102 మిల్లులున్నాయి. వాటిలో మిల్లుల వారీగా ధాన్యం కొనుగోలు రికార్డులను సివిల్ సప్లయ్ అధికారులకు అందించవలసి ఉంది. రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోళ్ల ఆధారంగా లెవీ లక్ష్యాన్ని నిర్ధారించి బియ్యం సేకరిస్తారు. ఈ నూతన విధానంతో ప్రతి మిల్లర్ తప్పనిసరిగా లక్ష్యం మేరకు లెవీకి బియ్యం ఇవ్వాలి.
లెవీకి ఇస్తేనే పర్మిట్లు...
ప్రతి రైస్‌మిల్లులో తయారైన బియ్యంలో 75శాతం లెవీకి ఇస్తే నే మిగతా 25 శాతం బియ్యం ఎగుమతులు చేసుకోవటానికి పౌరసరఫరాల శాఖ అనుమతులు ఇస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇలాగే లెవీ సేకరణలో జిల్లా యూనిట్ విధానాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో సేకరణ వేగంగా జరిగింది. నూతన విధానంతో బియ్యం ఇవ్వని వారికి మాత్రమే పర్మిట్లు నిలిపి వేస్తారు. దీంతో అటు మిల్లర్లకు, ఇటు అధికారులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ లెవీ సేకరణ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రావడం అక్టోబర్‌లోనే ప్రారంభమవుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నారు. 2012-13లో లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించవలసి ఉండగా ఇప్పటి వరకూ లక్షా 40 వేల మెట్రిక్ టన్నులను సేకరించారు. ఏడు వేల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించవలసి ఉండగా నాలుగు వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి లెవీ నూరుశాతం పూర్తి కావలసి ఉంది. ఈ నూతన విధానం వల్ల మిల్లర్లందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంది.
Advertisement