రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు | Vigilance Attack On Ricce Mills In Vizianagaram | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు

Published Tue, Nov 6 2018 8:04 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 AM

Vigilance Attack On Ricce Mills In Vizianagaram - Sakshi

దాడులు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ హరికృష్ణ

విజయనగరం,చీపురుపల్లి: పట్టణ శివారు రావివలస రోడ్‌లో గల సాయిలక్ష్మి ట్రేడింగ్‌ కంపెనీ (రైస్‌మిల్లు)తో పాటు అదే రైస్‌మిల్లుకు ప్రజాపంపిణీ బియ్యం (పీడీఎస్‌) సరఫరా చేస్తున్న ఆటోపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు  దాడులు నిర్వహించారు. ప్రజాపంపిణీ బియ్యం ఆ మిల్లులో ఉన్నాయన్న అనుమానంతో దాడులు చేపట్టగా.. వారు ఊహించిన విధంగా వందల క్వింటాల బియ్యం పట్టుబడ్డాయి. దీంతో పాటు రికార్డులు పరిశీలించగా అందులో ఉన్న లెక్కలకు, మిల్లులో ఉన్న స్టాకు సంబంధం లేకపోవడంతో దాదాపు రూ.40 లక్షలు విలువైన స్టాకు సీజ్‌ చేసి మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 30వై 2405 ఆటోలో పది బస్తాల పీడీఎస్‌ బియ్యం తరలిపోతున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చీపురుపల్లి – లావేరు రోడ్డులో  కనకమహాలక్ష్మి ఆలయం వద్ద పట్టుకున్నారు.

బియ్యాన్ని సాయిలక్ష్మి ట్రేడింగ్‌  కంపెనీకి తరలిస్తున్నట్లు చీపురుపల్లి మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన కిల్లంశెట్టి గణపతిరావు తెలిపారు. దీంతో విజిలెన్స్‌ ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది సాయిలక్ష్మి రైస్‌మిల్లుపై దాడి చేపట్టారు. అదే సమయంలో రైస్‌ మిల్లులో అన్‌లోడింగ్‌ జరుగుతున్న 19.5 క్వింటాళ్ల (39 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకున్నారు. అంతేకాకుండా రైస్‌ మిల్లులో 25.5 క్వింటాళ్ల (51 బస్తాలు) ప్రజాపంపిణీ బియ్యం నిల్వలు కూడా గుర్తించారు. అలాగే రైస్‌మిల్లు రికార్డుల్లో బియ్యం 1237 క్వింటాళ్లు... బ్రోకెన్‌ రైస్‌ 48.05 క్వింటాళ్లు.. బ్రౌన్‌ రైస్‌ 23.05 క్వింటాళ్లు ఉన్నట్లు రాసి ఉండగా నిల్వ ఉన్న స్టాకులో తేడాలున్నట్లు నిర్ధారించారు. దీంతో సుమారు 40 లక్షల రూపాయల విలువైన స్టాక్‌ను సీజ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్పీ హరికృష్ణ తెలిపారు.

భారీ స్థాయిలో అక్రమ రవాణా....
ప్రజాపంపిణీ బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ హరికృష్ణ తెలిపారు. పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్‌ చేపట్టి అనంతరం సన్నబియ్యంగా మార్కెట్‌కు తరలిస్తున్నారని చెప్పారు. చీపురుపల్లి కేంద్రంగా ఈ దందా ఎక్కువగా కొనసాగుతోందన్నారు. బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసేలా రవాణాశాఖాధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో డీఎస్పీ భార్గవనాయుడు, సీఐలు చంద్ర, కృష్ణ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.త్రినాథ్, సీఎస్‌డీటీ బి.ఈశ్వరరావు, వీఆర్‌ఓ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement