ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం! | PPP formula tobe impliment in Grain purchasings | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!

Published Wed, Jul 22 2015 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!

ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!

- ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా కసరత్తు
- కొనుగోళ్లకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్:
ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. లెవీ సేకరణ ఇకమీదట ఉండదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ధాన్యం సేకరణ మొదలు నిల్వ, మిల్లింగ్, రవాణా వరకు అన్నిరకాల వ్యవహారాలను ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ధాన్యం నాణ్యత పరీక్షల బాధ్యత సైతం ప్రైవేటు సంస్థల వ్యక్తుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలో పీపీపీ భాగస్వామ్య విధానాన్ని అనుసరించాలని సూచించింది. ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలను అమల్లోకి తెచ్చేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి పౌరసరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది.  

వ్యవహారమంతా ప్రైవేటు చేతుల్లోకి..
రాష్ట్రంలో ప్రస్తుతం వరకు కొనసాగుతూ వచ్చిన ధాన్యం సేకరణ విధానాన్ని వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సేకరణ భారం  రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ చేస్తున్న పీఏసీ, ఐకేపీ, డీసీఎంఎస్‌లు ఈ మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే ఐకేపీ పౌర సరఫరాలశాఖకు తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సమయంలో కేంద్రం పీపీపీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.

టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థ లేక వ్యక్తులను ఎంపిక చేసి ధాన్యం సేకరణ, మిల్లింగ్‌తోపాటు గోదాములు, మండల్ లెవల్ పాయింట్ (ఎంఎల్‌ఎస్) పాయింట్‌లోకి రవాణా బాధ్యతలను  వారికి కట్టబెట్టాలని సూచించింది. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు నైపుణ్యంగల సంస్థల పర్యవేక్షణలో అంటే.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఈ ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులకు ప్రభుత్వాల తరఫున బడ్జెట్ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం బాధ్యతను ప్రైవేటు సంస్థలే చూసుకుంటుండటంతో వారి చేతుల్లోకి వెళ్లినట్లే అవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement