కడెం, న్యూస్‌లైన్ : రైతులను దళారుల బారి నుంచి కాపాడి.. ధాన్యానికి మద్దతు ధర దక్కేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నాడు. క్వింటాల్ ధాన్యంపై రెండున్నర కిలోల ధాన్యం కోతపడుతోంది. తేమ పేరిట సా గుతున్న ఈ అదనపు దందాను పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలో పాత మద్దిపడగ, కొత్త మద్దిపడగ, లింగాపూర్, దస్తురాబాద్, మున్యాల, బు ట్టాపూర్, పాండ్వాపూర్ గ్రామాల్లో 20 రోజుల క్రితం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యంలో 17శాతం తేమ ఉంటే సరిపోతుంది.
ఆ ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. కానీ తేమ పేరిట నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని, రైస్‌మిల్లులో తూకం వేస్తే బరువు తగ్గి నష్టపోతామని చెబుతూ.. 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేస్తున్నారు. కాంటాలో 41 కిలోల బాట్లు వేసి 40 కిలోలుగానే పరిగణిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు రెండున్నర కిలోల ధాన్యం అదనంగా నిర్వాహకులకు చేరుతోంది. రైతులు ఈ రెండున్నర కిలోలు నష్టపోవాల్సి వస్తోంది. మంగళవారం పెద్దూరు గ్రామానికి చెందిన రైతు జీల నాగరాజు 52 సంచుల ధాన్యాన్ని పాండ్వాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి తీసుకెళ్లాడు. తేమ శాతం సరిగ్గానే ఉన్నా 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేశారు.
తేమ శాతం ఎక్కువగా ఉంటే ఇలా చేయాల్సి ఉన్నా అందరికీ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. దస్తురాబాద్‌లోని కేంద్రంలో ఖాళీ గన్నీ బ్యాగుపై తూకం రాళ్లు వేసి ఉంచుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూ కం విషయమై ఐకేపీ ఏపీఎం బుచ్చన్నను సంప్రదిం చగా.. కేంద్రాలను తనిఖీ చేస్తామని చెప్పారు. అదనంగా తూకం వేయడం సరికాదని, ఖాళీ సంచులు పెట్టి తూకం వేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారాజ్యం
Published Wed, Dec 11 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement