
ధాన్యం కొనుగోలు నిలిపివేత!
విజయనగరం కంటోన్మెంట్: రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడాన్ని నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా అవసరాల కన్నా ఎక్కువగా ధాన్యాన్ని సేకరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్వతీపురం డివిజన్ లో ధాన్యం కొనుగోలును ఇప్పటికే దాదాపు నిలిపివేశారు. అయితే అ ధికారికంగా ఆదేశాలు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు. విజయనగరం డివిజన్‌లో మాత్రం ధాన్యం వస్తున్నప్పటికీ జిల్లా అవసరాలు తీరేంత నిల్వలుండడం, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలను భద్రపరిచేందుకు గోడౌన్లు చాలకపోవడం వంటి కారణాలతో ధాన్యం కొనుగోళ్లను ముందుగా నిలిపివేస్తే తరువాత కస్టమ్ మిల్లింగ్‌తో జిల్లా అవసరాలకు బియ్యం అందించవచ్చనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ విషయమై పౌరసరఫరాల శాఖ జిల్లా ఇన్‌చార్జి మేనేజర్ ఎం గణపతిరావు, పౌరసరఫరాల శాఖ కలెక్టర్, జేసీ బి.రామారావుకు చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారు. దీంతో కొనుగోళ్లను నిలిపివేసేందుకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఎంఎం నాయక్‌ను కోరగా, వీలును బట్టి చర్యలు తీసుకోవాలని, జాయింట్ కలెక్టర్ చెప్పిన ప్రకారం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీఎం తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిపివేయాలనే ఆదేశాలు మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది.