దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్
చిన్న రైతులకు తోడ్పాటునందిస్తున్న ఆర్య.ఏజీ
గిడ్డంగులు, మార్కెటింగ్, ఫైనాన్స్ సదుపాయం
ఆర్య.ఏజీ ఎండీతో సాక్షి బిజినెస్ స్పెషల్ ఇంటర్వ్యూ
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్‌తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.
సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?
నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.
సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?
నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.
సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.
సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?
నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్‌ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.
సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?
నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment