పంట చేతికొచ్చే సరికి అన్నదాత కష్టాన్ని దోచేస్తున్న దళారులు
ధాన్యం కొనుగోళ్లలో వారు చెప్పిందే రేటు
రైతు నుంచి కొనేది దళారీ.. ప్రభుత్వానికి అమ్మేదీ దళారీనే
పేరుకు మాత్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు
రైతుల మద్దతు ధరను దోచేయడానికి పక్కా స్కెచ్
సిండికేట్‌గా మారిన మిల్లర్లు, వ్యాపారులు
గ్రామాల్లో ధాన్యం బస్తాలు పట్టేందుకు కూలీలు దొరకని దుస్థితి
ముందుగానే హమాలీలను గుప్పెట్లో పెట్టుకున్న దళారులు
సొంతంగా పంటను మిల్లులకు చేర్చుకోలేని రైతులు
పంటను ఆరబెట్టుకోలేక తెగనమ్ముకుంటున్న వైనం
తేమ శాతం ఎక్కువుందన్న సాకుతో తక్కువ ధరకు కొనుగోలు
75 కేజీల బస్తాకు రూ.150–325 వరకు నష్టపోతున్న రైతులు
ఈ ఖరీఫ్‌లో ప్రభుత్వం లక్ష్యం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. దళారుల జేబుల్లోకి సుమారు రూ.1,480 కోట్లు
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు కష్టకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధరను దక్కించుకోలేని దుస్థితిలో రైతాంగం విలవిల్లాడిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు మించి ‘దోపిడీ విపత్తు’ కర్షకులను ముంచేస్తోంది. పంట చేతికొచ్చిందన్న సంతోషం క్షణకాలంలో ఆవిరై పోతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ‘దళారీ రాజ్యం’ రాజ్యమేలుతోంది.
రైతులకు మద్దతు ధర దేవుడెరుగు.. చెప్పిన రేటుకు ధాన్యం ఇవ్వకుంటే కల్లంలో నుంచి సరుకు బయటకు వెళ్లే పరిస్థితే కనిపించడం లేదు. పేరుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనేది దళారులే. ప్రభుత్వానికి రైతుల పేరుతో ధాన్యం విక్రయించేదీ దళారులే. సంపూర్ణ మద్దతు ధర అందించాల్సిన కూటమి ప్రభుత్వం.. మిల్లర్లు, వ్యాపారుల దందాకు గేట్లు తెరిచి రైతుల నోట్లో మట్టి కొడుతోంది.
పంపాన వరప్రసాదరావు, వీఎస్‌వీ కృష్ణ కిరణ్ (సాక్షి, అమరావతి) :
రాష్ట్రంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోలేక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఏలుబడిలో 75 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.325 వరకు రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రారంభం నుంచే ఈ దోపిడీ పర్వం ఊపందుకుంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ప్రోద్బలంతోనే దళారులు చక్రం తిప్పుతున్నారు. పైకి మాత్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది.
రైతుల ఖాతాల్లో పూర్తి మద్దతు ధర జమ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తోంది. కానీ, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల్లో నూటికి 90 శాతం మంది బస్తాకు రూ.150 నుంచి రూ.325 నష్టాన్ని మూటగట్టుకుని అమ్ముకున్న దుస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. ఏలూరు జిల్లా నల్లజర్ల, భీమడోలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఈ పరిశీలనలో మిల్లర్ల దందా, దళారుల దోపిడీతో రైతులు పడుతున్న వెతలు వెలుగు చూశాయి.
సిండికేట్‌గా మారిన మిల్లర్లు
⇒ రైతులకు మేలు చేసేందుకే అంటూ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ఎత్తేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, దళారుల నెత్తిన పాలు పోసినట్టయ్యింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు/వ్యాపారులు సిండికేట్ అయ్యారు. జట్టు కూలీల (హమాలీలు)ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కోత కోసిన తర్వాత పంటను బస్తాల్లోకి నింపి వాహనాల్లో ఎక్కించాలంటే కూలీలు అవసరం. కానీ రైతులు జల్లెడపట్టినా కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది.
⇒‘దళారీ మాకు ముందుగానే రూ.10 వేలు ఇచ్చారు. ప్రభుత్వానికి పని చేస్తే డబ్బులు ఎప్పుడో వస్తాయి. మా ఇబ్బందులు మాకుంటాయి. అందుకే వెంటనే కూలి వచ్చేచోటే పనికి వస్తున్నాం’ అంటూ ఓ హమాలీ చెప్పుకొచ్చారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుందామంటే కనీస సౌకర్యాల్లేక రైతులకు దిక్కుతోచడం లేదు. రోడ్లపై ఆరబెట్టుకుందామంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తరఫున పని చేసేందుకు కూలీలు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీంతో చేసేది లేక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నష్టానికే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.
పెట్టుబడి సాయం అందక అప్పులు
⇒ గత ఐదేళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మేలో తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాకు జమ అయ్యేది. అలాగే పంటల బీమా పరిహారం కూడా రైతుల ఖాతాలో జమ చేసేవారు. ఖరీఫ్ పంట సాగులో దుక్కి పనులతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఈ సొమ్ము ఎంతగానో అక్కరకు వచ్చేది.
⇒ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రూపాయి కూడా జమ చేయలేదు. దీంతో ఈ ఏడాది పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు నానా అగచాట్లు పడ్డారు.
⇒ అత్యధిక శాతం మంది రైతులు ధాన్యం వ్యాపారుల (దళారులు) వద్ద చేబదులు తీసుకొని సాగు చేస్తే, మరికొంత మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3–5తో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. మరో వైపు విత్తు నుంచి కోత వరకు రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో విజృంభించిన తెగుళ్లు, చీడపీడల దాడికి దిగుబడులు కాస్త తగ్గిపోయాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన తర్వాత తేమ లేకుండా ఆరబెట్టి, కేంద్రానికి తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు.
⇒ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. పంట ఆరబెట్టుకునేందుకు కూలీల ఖర్చు భారంగా మారుతోంది. సరైన టార్ఫలిన్లు, ఫ్లాట్‌ఫారాలు లేక పోవడంతో పంటను జాగ్రత్త చేసి మంచి రేటుకు అమ్ముకునే గత్యంతరం లేక నష్టమని తెలిసినా తక్కువ రేటుకే దళారులకు తెగనమ్ముకుంటున్నారు.
రూ.1,480 కోట్ల దోపిడీకి ప్లాన్!
⇒ ఖరీఫ్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా ప్రకటించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. అయితే రైతులు కోసిన పంటను బస్తాల్లో నింపి, మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల పంటను మిల్లులకు తరలించేందుకు కమీషన్ల పేరిట భారీ దోపిడీకి తెరదీశారు.
⇒ ప్రస్తుత సీజన్‌లో కోసిన పంటను కోసినట్టే విక్రయిస్తే దళారులు 75 కేజీల బస్తాకు రూ.1,400కు బేరం కుదుర్చుకుంటున్నారు. కొంత ఆరిన పంటకు రూ.1550 – రూ.1600 లెక్కగడుతున్నారు. ఇలా టన్నుకు ఒక్కో రైతు సుమారు రూ.2,100 నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నాడు. ఈ లెక్కన 37 లక్షల టన్నుల సేకరణకు రూ.6,382 కోట్లు మద్దతు ధర రైతులుకు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సుమారు రూ.1,480 కోట్ల మేర మిల్లర్లు, దళారులు కలిసి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది.
గత ప్రభుత్వంలో దళారులకు ముకుతాడు
⇒ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన జిల్లాల్లో కోతలు ఊపందుకుంటాయి. డిసెంబర్‌లో పూర్తి స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు వస్తాయి. అయితే ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ రూ.50.90 కోట్లు విలువైన 22,122 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ, ఇప్పటికీ ధాన్యం విక్రయించిన వారిలో చాలా మంది రైతులకు రెండు రోజులు దాటినా మద్దతు ధర జమ కాలేదు.
⇒ గత ప్రభుత్వంలో రైతులకు వాస్తవ మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ట్రక్ షీట్ జనరేట్ చేసే సమయంలోనే ఏ మిల్లుకు లోడు వెళ్తుందో తెలిసేది. దీంతో దళారులు ముందుగా రైతులను మభ్యపెట్టే, బెదిరించే ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రైతులు సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తోలుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు(జీఎల్‌టీ) చార్జీలు ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. దాదాపు 39 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించింది.
కోతకు రెట్టింపు ఖర్చయ్యింది
నేను ఆరు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. రెండు రోజుల కిందటే పంటను (సంపత్ స్వర్ణ) కోశాను. తేమ శాతం ఎక్కువగా ఉంటే సరైన ధర దక్కట్లేదు. అందుకే దేవుడిపైనే భారం వేసి రోడ్డు పక్కన ఆరబోస్తున్నా. ఇటీవల వర్షానికి చేను వాలిపోయింది. అందుకే మిషన్‌పై ఎకరా పంటను గంటలో కోయాల్సి ఉండగా రెండున్నర గంటలు పట్టింది. ఎకరా కోతకు రూ.3 వేలు అవుతుంటే.. నాకు మాత్రం రూ.7 వేలు దాటింది. ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఆ స్థాయిలో మాత్రం మాకు మద్దతు ధర దక్కట్లేదు. – మర్రిపూడి నాగరాజు, అచెన్నపాలెం, ఏలూరు జిల్లా
పెట్టుబడి సాయం అందలేదు
1.80 ఎకరాల్లో ఎంటీయూ 7029 రకం వరి వేశాను. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వచ్చింది. ఈసారి పెట్టుబడి లేక చాలా అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు కోసిన పంటను అయినకాడకి అమ్ముకోవాల్సి వస్తోంది. – చావా నాగేశ్వరరావు, నల్లజర్ల, ఏలూరు జిల్లా
ఆరబెట్టుకునే అవకాశం లేదు
నేను ఐదెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ధాన్యం షావుకారు(వ్యాపారి) వద్ద చేబదులు తీసుకున్నాం. ఆరబెట్టుకునేందుకు అవకాశం లేక వ్యాపారికే అమ్మేసుకున్నా. ప్రభుత్వం వసతులు కల్పించి ఉంటే మాకు మంచి ధర దక్కేది. – ప్రగడ సురేష్, గౌరీపట్నం, పశ్చిమగోదావరి జిల్లా
ఆరబెట్టుకోలేకే అమ్ముకుంటున్నాం
⇒ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం మారెళ్లమూడికి చెందిన రైతు రామాంజనేయులు 3 ఎకరాల్లో పీఆర్ 126 రకం వరి వేశాడు. 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో బెంగళూరు నుంచి వచ్చే యంత్రాల సాయంతో కోత కోశారు. గంటకు రూ.3 వేలు తీసుకున్నారు. ‘కోసిన ధాన్యాన్ని ఆరబెడితే కానీ తేమ శాతం తగ్గదు. తేమ శాతం తగ్గితే కానీ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర ఇవ్వరు. ఆరబెట్టేందుకు గ్రామాల్లో కనీస సౌకర్యాల్లేవు. చేసేది లేక ధాన్యం షావుకారుకు బస్తా రూ.1,400 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది.
కానీ ఇంకా డబ్బులు చేతికి రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో రైతు కమిటీలకు ట్రాక్టర్లు, హార్వస్టర్లు, కల్టివేటర్లు ఇచ్చారు. అదే విధంగా డ్రైయర్లు, టార్పాలిన్లు ఇస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. తేమ శాతం తగ్గాక మద్దతు ధరకు అమ్ముకోగలుగుతాం’ అని చెప్పుకొచ్చాడు.
గతిలేక షావుకారికి అమ్మేశా
⇒ ఈ రైతు పేరు మొన్ని శ్రీను. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన ఈయన ఖరీఫ్‌లో రెండెకరాల్లో సంపత్ స్వర్ణ రకం వరి సాగు చేశాడు. ఈసారి పెట్టుబడి సాయం అందక షావుకారుల దగ్గర చేబదులు తీసుకున్నాడు. ఎకరాకు 37 బస్తాల దిగుబడి వచ్చింది. ‘కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్నా. కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే బస్తా (75 కేజీలు)కు రూ.1,725 వస్తుంది. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు.
పైగా పట్టుబడి పట్టే వాళ్లు (హమాలీలు) అందరూ షావుకారుల దగ్గరే ఉన్నారు. అందుకే షావుకారుతో మాట్లాడాను. తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంతో బస్తాకు రూ.1,400 చొప్పున ఇస్తానన్నారు. అది కూడా 15 రోజులకో.. 20 రోజులకో ఇస్తారు. నష్టపోతున్నామని తెలుసు. కానీ వాళ్లకు అమ్మడం తప్ప మాకు వేరే దారి లేద’ని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment