ధాన్యం కుప్పలపైనే రైతు కన్నుమూత
ఐదు రోజులుగా ధాన్యానికి కాపలా...
దోమకొండ(కామారెడ్డి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి, ధాన్యం కుప్ప కు కాపలాగా ఉన్న ఓ రైతు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (62) ఈనెల 11న 30 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ రవాణా సమస్యతో ధాన్యం తూకాలు వేగంగా సాగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కాంటా కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
ఈ క్రమంలో ఆకుల పోచయ్య ఐదు రోజులుగా తన ధాన్యానికి కాపలా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వరకు పొలం వద్ద పనులు చేసిన పోచయ్య.. రాత్రి భోజనం చేసి వెళ్లి.. ధాన్యం వద్ద కాపలాగా పడుకున్నాడు. మంగళవారం వేకువజామున తోటి రైతులు లేపడానికి ప్రయత్నించగా, అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.