యేసుప్రభువు వ్యవసాయ పరిభాషను తన బోధల్లో విస్తృతంగా వాడాడు. ఆయన బోధలు ప్రజల్లో అందుకే అంత బలంగా నాటుకున్నాయి. సిలువ శిక్షకు తాను సిద్ధపడుతూ తదనంతర పరిణామాలకు తన శిష్యులను కూడా సిద్ధం చేస్తున్న కీలక సమయంలో ‘నా తండ్రి వ్యవసాయదారుడు’ అంటూ ఒక అద్భుతమైన పరలోక వివరణను యేసుప్రభువిచ్చాడు(యోహాను15:1). పగలనక, రాత్రనక తాను ఎందుకు అంతగా శ్రమిస్తున్నాడో ఆ ఒక్క మాటలో యేసుక్రీస్తు వివరించాడు. ఆధునికత ఎంతగా ప్రబలినా, మనిషికి ఆకలెయ్యక మానదు, దాన్ని తీర్చే ధాన్యాన్ని రైతు పండించకా తప్పదు. అందువల్ల రైతు లేని ప్రపంచాన్ని ఇంకొక లక్ష ఏళ్ళ తర్వాత కూడా మనం ఉహించుకోలేం. కష్టాలు, కన్నీళ్లు, శ్రమ, త్యాగం లేని రైతు నిస్వార్థ జీవితాన్ని కూడా మనం ఉహించుకోలేము. ఈ లోకంలో రైతుకొక్కడికే అందరిలాగా వారాంతపు సెలవులుండవు, నిర్ణీత పనివేళలూ ఉండవు. అతని ఆరోగ్యానికి భరోసా ఉండదు, కాయకష్టానికి పరిమితులుండవు, పొలంలో రాత్రిపూట విషసర్పం కాటేసినా పట్టించుకునే నాథుడుండడు. ఎండా, వానా, చలి, వరదలు, భూకంపాల పేరిట అంతటా, అందరికీ సెలవులుంటాయి, ఒక్క రైతుకు తప్ప.
చంటి బిడ్డలను రెండేళ్లు జాగ్రత్తగా సాకితే, పెరిగి ప్రయోజకులై తమకు ఆసరాగా ఉంటారన్న భరోసా తల్లిదండ్రులకు ఉండొచ్చు. రైతుకా భాగ్యం లేదు. దుక్కి, దున్ని, విత్తనం వేసిన నాటి నుండి, కోతలు ముగిసి ధాన్యం ఇంటికి చేరేదాకా, అంటే మొదటి నుండి చివరి దాకా నిద్రాహారాలు మానేసి రైతు తన పంటను చంటి బిడ్డ లాగా సాకవలసిందే. ఇంత కష్టపడ్డా, పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం, వరదలొస్తే, భోరున ఏడవాల్సిందే. చేసిన అప్పు తీర్చలేక, మరోవైపు లోకమంతటికీ అన్నం పెట్టేవాడై ఉండీ, తన ఇంట్లోనే భార్యా పిల్లలు పస్తులుండటం చూడలేక కుమిలిపోతూనే, మరో పంట కోసం శ్రమించేందుకు రైతు సిద్ధపడాల్సిందే!! ‘నేను నా పరలోకపు తండ్రి అలాంటి రైతులం, కాబట్టి నా నామాన్ని ధరించిన మీరంతా రైతులే!! అన్నది విశ్వాసులకు ప్రభువు ఆనాడు చేసిన బోధ సారాంశం. ఎందుకంటే, తమ రక్షకుడి లాగే, ఆయన శిష్యులు కూడా రైతుల్లాగా కష్టపడకపోతే, ‘ప్రేమసువార్త’ భూదిగంతాలకు చేరదు.
పంటను కాపాడుకోవడానికి రైతు ఎంతటి త్యాగానికైనా, శ్రమకైనా సిద్ధపడినట్టే, ఈ లోకాన్ని శాంతితో, సదాశయాలతో నిండిన పరలోకానికి సాదృశ్యమైన దేవుని రాజ్యంగా మార్చడానికి తన కుమారుడైన యేసుప్రభువును ఈ లోకానికి పంపేందుకు పరమతండ్రి త్యాగం చేసినట్టే, పాపుల కోసం సిలువలో తన ప్రాణాన్నే బలియాగంగా సమర్పించే త్యాగం చేసి రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రేమను చాటుకున్నాడు. ఎటొచ్చీ ఈ రైతులిద్దరిలాగే, నిండా త్యాగాలుండా ల్సిన విశ్వాసులు, పరిచారకుల జీవితాలు, పరిచర్యలు ఈ రోజుల్లో విలాసాలు, భోగాల్లో మునిగి తేలుతు న్నాయి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి కాని నాకు తల దాచుకోవడానికి కూడా స్థలం లేదని ఎంతో సంతృప్తి, ఆత్మానందం, జీవన సాఫల్యంతో గౌరవప్రదంగా, పారదర్శకంగా ప్రకటించిన యేసుప్రభువు అనుచరులుగా చెప్పుకునే వాళ్ళు. ఈనాడు కోట్లకు పడగెత్తుతూ, వస్త్రధారణలో, జీవన శైలిలో, ధనార్జనలో పోటీపడుతూ ‘టచ్ మీ నాట్’ అన్నట్టు తారల్లాగా వ్యవహరించడం ఎంతో బాధ కలిగించే విషయం. ఇలాంటి వాళ్ళతో ప్రకటించబడేది దేవుని రాజ్యమా, శత్రువు రాజ్యమా? శ్రమ తెలియకుండా తమ కోసం తామే స్వార్థంగా బతికే సెలెబ్రెటీలకు, ‘నేను’ ‘నా’ అనే మాటలే ఉండకూడని దేవుని సేవకులకు పోలిక ఏమైనా ఉందా??
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
ఈ మెయిల్: prabhukirant@gmail.com
Comments
Please login to add a commentAdd a comment