అడుగడుగునా వేదనే
విత్తు వేసినప్పటి నుంచీ కష్టాలే కన్నీరు పెట్టించిన కరెంటు కోతలు
సమయానికి రాని వానలు అదును దాటాక వచ్చి తిప్పలు
చేతికందిన పంట చేజారిపాయే అందిన దిగుబడికీ ‘మద్దతు’ లేదాయే
జడ్‌పీ చైర్మన్‌కు రైతుల వినతి
ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్. ఇందూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణ. ఓ వైపు ధాన్యం రాశులు. మరోవైపు తూకాలలో నిమగ్నమైన దడ్వాయిలు. వడ్ల అమ్మకం కోసం బారులు తీరిన రైతులు. కనీస మద్దతు ధర లేదు. కాంటాలు జరిగిన 48 గంటలలో చెల్లింపులు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా తప్పని పడిగాపులు. కరెంట్ కోతలు. సమయానికి పడని వానలు. అదును దాటాక కురిసి పంటను చెడగొట్టిన వర్షాలు. ఇన్ని కష్టాల నడుమ చేతి కందిన కొద్దో, గొప్పో పంటకు లభించని గిట్టుబాటు ధర. దళారుల ప్రమేయం. అధికారుల మౌనవ్రతం. అన్నదాత వేదన అంతులేనిది. ఈ నేపథ్యంలో కర్షకుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు ‘సాక్షి’ ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి వారితో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
రాజుగారు ఏమన్నారంటే
రైతులు పండించిన పంటలకు సర్కారు మద్దతు ధర ఇస్తుంది. అందుకోసం నేను కూడా ప్రయత్నిస్తా. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతుల కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. వానలు, నీటి సదుపాయాలు చూసుకుని పంటలను వేసుకోవాలి. అన్నదాతలను ప్రోత్సహించేందుకు మేం ఎంతగానో కృషి చేస్తున్నం. ఇక నుంచి కరెంటు సమస్య లేకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నం. ప్రతి రైతుకు మద్దతు ధర అందుతుంది. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినం. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలిస్తం. మార్కెటు యార్డులలో తగిన సౌకర్యాలు కల్పిస్తం. అన్నదాతలు ఆరుతడి పంటల మీద దృష్టి సారించాలి.
చైర్మన్: బాగున్నవా.. నీ పేరేంది... ఎక్కడి నుంచి వచ్చినవు?
రైతు : నా పేరు పొట్టయ్య... బాన్సువాడ నుంచి వచ్చిన.
చైర్మన్: ఎంత ధాన్యం తీసుకచ్చినవు?
పొట్టయ్య : 40 సంచులు తీసుకొచ్చిన.
చైర్మన్: పంట బాగ పండిందా?
పొట్టయ్య : ఈ సారి పంటలు బాగా పండలేదు సారూ. వానలు లేవు. సరిగ్గా కరెంటూ లేకపాయే. దీంతో పంట చాల తక్కువగా వచ్చింది.
లింగయ్య (వెల్మల్) : కరెంటు సక్కగ లేకనే సాన ఇబ్బందులు పడ్డం. ఎప్పుడస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపాయె. దీంతో పంటలను కాపాడుకోలేకపోయినం.
చైర్మన్: ఎంత పంట వేసినవు...ఎంత పండింది?
లింగయ్య (కేశ్‌పల్లి) : మూడెకరాలు వరి వేసిన. కరెంటు, వానలు లేక ఎకరంన్నరే పం డింది. అంతా లాస్ లాసే.
చైర్మన్: మరి ఏదన్న ఆరుతడి పంట వేయకపోయినవా?
పోశెట్టి: ఖరీఫ్‌లో వానలను నమ్ముకొని ఏటా వరి మాత్రమే ఏస్తం. ఈసారి
ఠమొదటిపేజీ తరువాయి
కూడా పంటలు వేసినంక కూడా వానలు పడుతయనుకున్నం. కానీ, పడకపాయే!
చైర్మన్: ఏం సర్దార్...మద్దతు ధర వస్తందా?
సర్దార్ : ధర బాగా తక్కువగా చేస్తున్నరు. సార్లేమో రూ. 1,400 అంటే, మార్కెట్‌లో రూ. 1,200కే అడుగుతున్నారు. ఏమన్నంటే వడ్లు బాగా లేవంటున్నరు.
చైర్మన్: ఇక్కడ అధికారి ఎవరున్నరు ? (అంతలోనే ఓ అధికారి చైర్మన్ వద్దకు వచ్చారు) మీ పేరేంది?
అధికారి : నాపేరు రమేశ్ సార్. గ్రేడ్-1 అధికారిని.
చైర్మన్: అచ్ఛా.. రమేశ్ గారూ రైతుకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు?
రమేశ్ : వడ్లను పూర్తిగా పరిశీలించి తరువాతనే ధరను నిర్ణయిస్తున్నాం సార్. కొద్దిపాటి తేడా ఉంటే రైతులకు వివరిస్తున్నాం. అందుకే ధర తక్కువగా ఉన్నట్లుంది.
చైర్మన్: ప్రతి రైతుకు మద్దతు ధర తప్పని సరి వచ్చే లా చూడాలి. ఇలా కారణాలు చూపెడితే ఎట్ల మరీ?
గంగారాం : మీరైనా వాళ్లని అడుగండి సారూ. మ ద్దతు ధర ఇవ్వడం లేదు. ఏవో కారణాలు చూపెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లయితే మే మెట్ల బతుకుతం.
నారాయణ : ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. సమయానికి వడ్లను కొనేవారు లేరు. కొంటే మద్దతు ధర లేదు. సర్కారేమో మద్దతు ధర ఇస్తామంటాంది.
చైర్మన్: మీరు పండించిన పంటకు మద్దతు ధర తప్పనిసరి వస్తుంది. అధికారులు మద్దతు ధరను మీకు అందిస్తారు. మీరు బాధ పడవద్దు.
ఎల్లయ్య : పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు.
చైర్మన్: ఎంత పంట వేసినవు. ఖర్చు ఎంత అయింది. మీకు ఎంత మిగులుతుంది?
ఎల్లయ్య : నాలుగు ఎకరాలలో వరి వేసిన. లక్ష రూపాయల వరకు ఖర్చయింది. నీళ్లందక సగం పంట ఎండిపోయింది. వచ్చిన పంటను అమ్మితే లక్ష రూపాయలు కూడా రావడం లేదు.
పి.పి. గంగారెడ్డి (గోవింద్‌పేట్) : చాలా కష్టాలు పడుతున్నాం సార్. పొద్దనక, రాత్రనక పంటలు పం డిస్తే, పండించిన దానికి మద్దతు ధర లేదు. కొనేటప్పుడు ఏమో అన్ని ధరలు ఎక్కువగా ఉన్నాయి. మేము అమ్మితే మాత్రం తక్కువగా కొంటున్నారు. మేమెట్ల బతకాలే!
చైర్మన్: మీరు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుంది. కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడే మీరు ధా న్యం విక్రయించాలి. అప్పుడు సరైన మద్దతు ధర లభిస్తుంది. దళారులను నమ్మవద్దు.
రమేశ్ (నిర్మల్) : ఊళ్లళ్లకచ్చే దళారులే ధరలు తక్కువగా ఉన్నయంటూ రైతులను మోసం చేస్తున్నరు. వారి అడిగిన ధరకే వడ్లు ఇవ్వాల్సి వస్తాంది. అందు కే నేను ఇక్కడికి వచ్చిన.
చైర్మన్: మంచి పని చేసినవు. ఇక్కడ అధికారులు మద్దతు ధర తప్పనిసరిగా ఇస్తరు.
రాజన్న : సారూ.. సోయాలు వేసి చాలా నష్టపోయినం. పంట అసలు చేతికి రాలేదు. నీళ్లు లేక సగం ఎండిపోతే, రోగం వచ్చి మరి కొంత ఎండిపోయింది. వడ్లు అమ్మడానికి తీసుకొచ్చిన. దీనికన్న మద్దతు ధర వస్తుందో లేదోనని చూస్తున్న.
చైర్మన్: నువ్వు తీసుకొచ్చిన వడ్లకు మంచి ధర వస్తది. ఏదైనా సమస్య ఉంటే మార్కెట్ కమిటీ అధికారులను కలువు.
రాజవ్వ : కరెంటు సమస్య ఇంకా ఎన్ని రోజులుం టది?
చైర్మన్: త్వరలోనే కరెంటు సమస్య తీరిపోతది. మన తెలంగాణలో ఉన్న నీళ్లను బాగా వాడుకుందాం. కరెం టు కూడా ఉంటుంది. పంటలు బాగా పండించుకోవచ్చు.
సాయిలు : సారూ... ప్రతి ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. అప్పుడే మాకు మద్దతు ధర దొరుకుతది.
చైర్మన్: అలా ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తాం. మీ ఊరిలోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర వచ్చేలా చూస్తాం.
వెంకటేశ్ : మక్కలకు ‘మద్దతు’ దొరకడం లేదు. ఆరుతడి పం ట అని వేస్తే దానికి కూడా ధర లేకుంటే ఎట్లా!
నాగరాజు : ఆరుతడి పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేదంటే పండించిన పంట ను భద్రపరుచుకునేందుకు గోదాములు ఉచితంగా ఇవ్వాలి.
చైర్మన్: ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాజయ్య (నందిపేట) : అధికారులు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేయాలి.
మాజీద్ ఖాన్, గ్రేడ్-3 అధికారి : మార్కెట్ యార్డుకు వచ్చే ధాన్యానికి తప్పకుండా మద్దతు ధర ఇప్పిస్తున్నాం, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
చైర్మన్: మార్కెట్‌కు వచ్చే రైతులకు అధికారులు సహాయ సహకారాలు అందించాలి. వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి.
రమేశ్, గ్రేడ్-2 అధికారి : రైతుల కోసం అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.