
కొనుగోళ్లను వేగవంతం చేయండి
- ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై ఆదివారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, సీఎం కార్యాలయ అధికారులు సతీష్‌చంద్ర, జి.సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ, నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
గతేడాది కన్నా ఈ సంవత్సరం ఇప్పటివరకు రైతుల నుంచి ఎక్కువ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది జనవరి 11 నాటికి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా.. ఈ ఏడాది ఇదే సమయానికి 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నులు, మిల్లర్ల ద్వారా 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. సీఎం స్పందిస్తూ ధాన్యం కొనుగోలు సొమ్మును రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని సూచించారు.
పారదర్శకంగా సంక్రాంతి సరుకుల కొనుగోలు..
‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమ సరుకుల కొనుగోలు, పంపిణీ ఎంతో పారదర్శకంగా జరిగిందని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థించుకున్నారు. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేయడం సబబు కాదన్నారు. 12వ తేదీ సాయంత్రానికల్లా సరుకుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆయనీ సందర్భంగా ఆదేశించారు. వివిధ జిల్లాల పార్టీ నాయకులతో తాను నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లోనూ సంక్రాంతి కానుక పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన ఉన్నట్టు దృష్టికి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో 50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ విద్యా సంస్థ ఏర్పాటుకవసరమయ్యే భూమి విషయంలో.. అటవీ భూమిని డీనోటిఫై చేయడం, ఏలూరులో భూసేకరణ చేయడం.. ఈ రెంటిలో ఏది త్వరితగతిన చేపట్టవచ్చో పరిశీలించి దానిని అమలు చేయాలని సూచించారు.