కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 3 లక్షల 20 వేల 176 మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3 లక్షల 5 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లో నిల్వ ఉందన్నారు.
ఈ ధాన్యాన్ని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పాక్షికంగా తడిసిందని, ఈ తడిసిన ధాన్యాన్ని మానవతా దృక్పథంతో మిల్లుల యజమానులు అన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు మిల్లర్ల సంఘం ప్రతినిధులు అంగీకరించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, పౌర సరఫరాల శాఖ డీఎం, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
3.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
Published Tue, May 27 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement